లక్షా 20 వేల పోస్టులు గాయబ్.. అర కొర ఖాళీలే చూపిస్తున్న సర్కార్

లక్షా 20 వేల పోస్టులు గాయబ్.. అర కొర ఖాళీలే చూపిస్తున్న సర్కార్

లక్షకు పైగా పోస్టుల్లో  కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ స్టాఫ్

అన్ని డిపార్ట్​మెంట్లలో అరకొర ఖాళీలే చూపిస్తున్న సర్కారు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత?
విభజన చట్టం ప్రకారం మనకు దక్కిన ఉద్యోగాలు ఎన్ని?

అందులో ఎన్ని కొలువులను ప్రభుత్వం మనకు చూపెడుతున్నది?

సొంత రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఆరేండ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో మెదులుతున్న ప్రశ్నలివి.

రాష్ట్రంలో ఉండాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం సంఖ్య అక్షరాలా ఐదు లక్షల ఇరవై వేలు.

కానీ.. ఉన్నది 2 లక్షల 95 వేలు మాత్రమే.

మిగతా వాటిలో లక్షకు పైగా పోస్టులను కాంట్రాక్ట్​, ఔట్ సోర్సింగ్ కు అప్పగించగా.. దాదాపు లక్షా 20 వేల పోస్టులు పత్తా లేకుండా పోయాయి

హైదరాబాద్, వెలుగు:  విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కిన కేడర్​ స్ట్రెంత్​ ఆరేండ్లుగా ఏనాడూ ఫుల్​గా కనిపించడం లేదు. అందులో చాలా పోస్టులు ఊసులోనే లేవు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 5.20 లక్షల ఎంప్లాయీస్ కేడర్ స్ట్రెంత్  శాంక్షన్​ అయింది. గవర్నమెంట్​తోపాటు వివిధ కార్పొరేషన్ల పోస్టులన్నీ ఇందులో ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం 2.95 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన మిగతా 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండాలి. కానీ.. కొన్ని విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్ సిబ్బందినే శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం..  ఫోర్త్ క్లాస్​ ఉద్యోగాల భర్తీని అసలే పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో కేడర్​ స్ట్రెంత్​ భారీగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు లక్షల్లో ఖాళీలు లేనే లేవంటూ ప్రభుత్వం ప్రతి సందర్భంలో చేతులు దులుపుకుంటోంది. విభజన సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజనను పోస్టుల వారీగా పక్కాగా లెక్కతీశారు.

సెక్రటేరియట్, హెచ్​వో డీ  జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లు,  స్థానిక సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్లు, కంపెనీల కింద పనిచేసే ఎంప్లాయీస్ మొత్తాన్ని అప్పట్లో లెక్కగట్టారు. కానీ.. వీటిని భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సర్దుబాటుతోనే కాలం గడుపుతోంది. ఈ ఆరేండ్లలోనే  వివిధ డిపార్ట్​మెంట్లలో దాదాపు ఒక లక్షా 20 వేల పోస్టులు కనిపించకుండా పోయాయి. మెసెంజర్లు, టైప్ రైటర్లు, డ్రైవర్లు, అటెండర్లు, లిఫ్ట్​ బాయ్స్ తోపాటు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ పోస్టుల అవసరం లేనే లేదని ప్రభుత్వం భావిస్తోంది.

సర్దుబాటు తప్ప.. రెగ్యులర్​ పోస్టులేవి?

ఉద్యమ సమయంలో కొత్త రాష్ట్రం వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయంటూ ఊరూరా  నిరుద్యోగులను ఊరించిన టీఆర్​ఎస్.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాల ఊసెత్తకుండా దాటేసింది. వివిధ డిపార్ట్​మెంట్లలో  ప్రతి నెలా రిటైరైన ఉద్యోగుల ఖాళీలను కూడా భర్తీ చేయకుండా పెండింగ్​లో పెట్టింది. పది జిల్లాలను  33 జిల్లాలుగా విభజించిన సమయంలోనూ.. పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఆశించిన నిరుద్యోగులకు చుక్కెదురైంది. ఉన్న ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయటం తప్ప.. కొత్త పోస్టుల క్రియేషన్​, ఉన్న ఖాళీలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేయలేదు. ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్​, జీహెచ్​ఎంసీ ఎన్నికలు ముగిసిన  తర్వాత.. 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయి..? ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారు..? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే  ఫైనాన్స్ విభాగం వివిధ శాఖలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది. రెగ్యులర్​ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు? వారు ఎప్పుడు రిటైర్​ అవుతున్నారు? కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో ఎంత మంది పనిచేస్తున్నారు? అనే వివరాలు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.

శాంక్షన్డ్ పోస్టులు.. కాంట్రాక్ట్ కు అప్పగింతలు

వివిధ ప్రభుత్వ డిపార్ట్​మెంట్లలో ఒక లక్షా 20వేల  మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు ఆఫీసర్లు లెక్కతీశారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం శాంక్షన్డ్​ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి వీలు లేదు. కానీ ప్రభుత్వం ఓ ఉద్యోగి రిటైర్ అయితే ఆ స్థానాన్ని రెగ్యులర్ పోస్టుగా భర్తీ చేయడం లేదు. దీంతో ఏటా వేల  ఉద్యోగాలను కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌ సోర్సింగ్‌‌కు అప్పజేప్తున్నది. హెల్త్ డిపార్ట్ మెంట్​లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్  దాదాపు ఇరవై వేల మంది ఉన్నారు.

శాశ్వతంగా కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగే..

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని డిపార్ట్​మెంట్లలో రెగ్యులర్ పద్ధతిన ఉద్యోగాలను భర్తీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. చాలా కాలంగా పనిచేస్తున్న ఎంప్లాయీస్ ను తొలగించి, కొత్తగా నియామకాలు చేపడితే విమర్శలు వస్తాయనే భయం ప్రభుత్వంలో ఉందని వారు అంటున్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లు దాదాపు 8 వేల మంది వరకు ఉన్నారు. వీరి ప్లేస్​లో రెగ్యులర్​ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వంలో ఏ మాత్రం లేదన్న  విమర్శలు ఉన్నాయి.

పోలీస్ డిపార్ట్​మెంట్​లో  19,564 ఖాళీలు

పోలీసు శాఖలో 19,564 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 19,143 కానిస్టేబుల్​, 413 ఎస్​ఐ, 8 ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్​ఐ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు.

పోలీస్​, ఎడ్యుకేషన్​లోనే ఎక్కువ ఖాళీలు

ప్రస్తుతం వివిధ డిపార్ట్​మెంట్లలో 43 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే డిపార్ట్​మెంట్ల నుంచి అందిన వివరాలపై ఆఫీసర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎడ్యుకేషన్, పోలీసు డిపార్ట్ మెంట్ లోనే ఎక్కువ ఖాళీలు ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. అది కూడా ఎడ్యుకేషన్​ డిపార్ట్​

మెంట్​లో 15 వేల పోస్టులు,  పోలీస్​ డిపార్ట్​మెంట్​లో 19 వేల పోస్టులు అని తేల్చారు. ఈ రెండు శాఖల్లోనే  ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్​ అవుతున్నారని, అందుకే ఏటా ఖాళీల సంఖ్య ఎక్కువ ఉంటోందని ఆఫీసర్లు చెప్తున్నారు. మిగతా కొన్ని ఖాళీలు ఇతర  డిపార్ట్​మెంట్లలో ఉన్నట్టు భావిస్తున్నారు.

శాంక్షన్డ్​ పోస్టులన్నీ నింపాలి

 

రాష్ట్ర విభజన సమయంలో చూపించిన శాంక్షన్డ్ పోస్టులను కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడిన తర్వాత పోస్టులు మరిన్ని పెరగాల్సి ఉంది. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు వేయకుండా, నిజంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్​తో ఏర్పడిందనే విషయం మరిచిపోవద్దు. ‑ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ.