చెన్నై: తమిళనాడులో వేసవికి ముందు ఈ వేడి పుట్టించే వార్త ప్రజలను నీరసపరిచింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరను క్యాన్పై 5 రూపాయలు పెంచుతూ తమిళనాడు బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. పవర్ పెట్రోల్ ధరను రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం వెలువడిన మరుసటి రోజే తమిళనాడులో 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ధరను పెంచడం గమనార్హం. ముడి సరుకు ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు కారణమని అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశంలో ప్రకటించారు.
VIDEO | Tamil Nadu: Packaged drinking water prices raised by Rs 3–5, manufacturers blame rising input costs.
— Press Trust of India (@PTI_News) March 21, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/jWeCxwGTRc
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లీటర్ బాటిల్ ధర కూడా 3 రూపాయలు పెంచినట్లు తెలిపారు. 20 ఏళ్లుగా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని ధరను పెంచలేదని.. కానీ ఇప్పుడు పెంచక తప్పడం లేదని తమిళనాడు బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు.
నీళ్లను శుద్ధి చేసే ప్రక్రియలో ఎలక్ట్రిసిటీ ఖర్చు పెరగడంతో పాటు మెషీన్ మెయింటెనెన్స్ ఖర్చు పెరిగిందని.. ప్లాస్టిక్ క్యాన్లు, ఆ క్యాన్ల మూతలు, లేబుల్స్.. ఇలా అన్నిటి రేట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. వీటికి తోడు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రొడక్షన్ ప్లాంట్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు క్యాన్లను చేరవేయడానికి ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా పెరిగిందని చెప్పారు. దీనికి తోడు.. పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెంచక తప్పడం లేదని.. ఈ కారణాల రీత్యా ధరను పెంచుతున్నామని తెలిపారు.
►ALSO READ | దర్జాగా వచ్చి.. గ్యాస్ సిలిండర్లు ఎలా ఎత్తుకెళుతున్నారో చూడండీ..
తమిళనాడులో మరీ ముఖ్యంగా చెన్నై సిటీలో చాలా మంది ఈ ప్యాకేజ్డ్ 20 లీటర్ల క్యాన్లను ఇళ్లకు తెప్పించుకుంటుంటారు. ఇప్పుడు రేట్లు పెంచడంతో ఐటీ ఉద్యోగులతో పాటు చెన్నై సిటీలోని ఎగువ మధ్య తరగతి ప్రజల నెలవారీ బడ్జెట్ స్వల్పంగా పెరిగింది. ఆఫీసులు, రెస్టారెంట్లు, హోటళ్లపై కూడా అదనపు భారం పడినట్లయింది.
