మహారాష్ట్రలో కొత్తగా 20, గుజరాత్‌లో 13 ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 20, గుజరాత్‌లో 13 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ (శుక్రవారం) ఒక్క రోజే కొత్తగా 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 100 దాటింది. ఇవాళ నమోదైన కేసులతో కలిసి మహారాష్ట్రలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 108కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారినపడిన వారిలో 54 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ 1410 కరోనా కేసులు నమోదు కాగా, 12 మంది మరణించారు. మహారాష్ట్రలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 8,426 ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

గుజరాత్‌లో మరో 13 కేసులు

గుజరాత్‌లో ఇవాళ మరో 13 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 43కు చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఇవాళ ఒక్క రోజులో రాష్ట్రంలో మొత్తం 98 కరోనా కేసులు నమోదయ్యాయని, ముగ్గురు మరణించారణి గుజరాత్ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆ దేశం నుంచి వస్తే 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి

ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ నుంచి వచ్చే ముంబై వాసులకు కరోనా నెగెటివ్ వచ్చినా సరే ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఏడో రోజున ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నెగెటివ్ వస్తే ఓకే.. పాజిటివ్ వస్తే వారి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపనున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చే మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఉండే వారు ఎయిర్‌‌పోర్టు నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పార్ట్‌ వెహికల్స్‌లో ఇండ్లకు వెళ్లకూడదని ఆదేశించింది. వారిని ఇంటి వద్ద దించేందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.