కొండచరియలు విరిగిపడి జపాన్‌‌లో 20 మంది గల్లంతు

కొండచరియలు విరిగిపడి జపాన్‌‌లో 20  మంది గల్లంతు


టోక్యో: జపాన్‌‌ రాజధాని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటామి సిటీలో శనివారం కొండచరియలు విరిగిపడి 20 మంది గల్లంతయ్యారు. 80 ఇండ్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. అధికారులు సుమారు 100 మంది వరకు బురద కింద కూరుకుపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అటామిలో మూడ్రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక నెలలో కురవాల్సిన వర్షం ఈ మూడ్రోజుల్లోనే కుండపోతగా కురిసిందని, దీంతో అక్కడి కొండల్లోని మట్టి వదులై ఒక్కసారిగా బురద, కొండచరియలు ఇండ్లపై పడ్డాయని అధికారులు చెప్పారు. బురదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ పనులు వేగవంతం చేశామన్నారు. కొండచరియలు విరిగి పడే అవకాశమున్న ప్రాంతాల్లోని జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న ప్రధాని యోషిహిడే సుగా కేబినెట్‌‌ మీటింగ్‌‌ నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్‌‌ను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్ముందు ఇలాంటి విపత్తులకు మరింత సిద్ధంగా ఉండాలని చెప్పారు.