రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు!..నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు 20 వేల ఇళ్ల కేటాయింపు

 రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు!..నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు 20 వేల ఇళ్ల కేటాయింపు
  •   
  •     నేటి నుంచి లబ్ధిదారుల జాబితా వెరిఫికేషన్ షురూ.. 

నల్గొండ, వెలుగు:  రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలలోని 10 నియోజకవర్గాలకుగానూ నియోజకవర్గానికి 2 వేల చొప్పున మొత్తం 20 వేల ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఇండ్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతాలకు, 40 శాతం పట్టణ ప్రాంతాలకు కేటాయించగా, ఇంండ్లు లేని పేదలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. పెంకులు లేదా రేకులతో ఉండి ఇప్పటికే గోడలు నిర్మించుకున్న ఇండ్లపై స్లాబ్ వేసుకునేందుకు రూ.2 లక్షల సహాయాన్ని అందిస్తారు. గృహ నిర్మాణ శాఖ సర్వే ప్రకారం నల్గొండ జిల్లాలో 1,891, సూర్యాపేట జిల్లాలో 3,045 చొప్పున మొత్తం 4,936 గుడిసెలను గుర్తించారు. ఈ లబ్ధిదారులతో పాటు ఇతర అర్హులెవరైనా ఉంటే ఎంపీడీఓల ద్వారా కొత్త ప్రతిపాదనలకు అవకాశం కల్పించారు. నేటి నుంచే గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నివాసాలను ప్రత్యక్షంగా సందర్శించి, ఏఈలు, ఎంపీడీఓల నివేదికల ఆధారంగా అర్హతను నిర్ధారించి తుది జాబితాను రూపొందించనున్నారు. 

డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఇళ్ల పంపిణీ!

నల్లగొండ పట్టణంలో గత ఐదేండ్లుగా పంపిణీ కాకుండా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తొలి విడత డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్ ఇండ్లలో దెబ్బతిన్న విద్యుత్ వైరింగ్, తలుపులు, కిటికీల రిపేర్లను పూర్తి చేసి వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో ఎంపికైన లబ్ధిదారులకే ఈ ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ కాలనీల్లో పార్కులు లాంటి మౌలిక వసతులు కల్పిస్తూనే, మహిళా స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కోసం దుకాణ సముదాయాల నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇండ్లు కేటాయించినప్పటికీ లబ్ధిదారులు అందులో చేరకపోతే, మరో రెండు మూడు నెలలు వేచి చూసి, నిజమైన అర్హులు లేరని తేలితే ఆ కేటాయింపులను రద్దు చేసి ఇతర అర్హులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.