గత ఐదేళ్లలాగానే ఈసారీ వరాలు..
ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పన్ను చెల్లింపుదారులు
వెలుగు, బిజినెస్‌డెస్క్ : మధ్య తరగతి ప్రజల ఆశాజ్యోతి ‘బడ్జెట్ 2019’ వచ్చే నెల పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కొత్తగా మళ్లీ ఏర్పడిన ఎన్డీయే సర్కారే 2019 బడ్జెట్ బండిని కొత్త ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్‌పై మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.ముందు ఐదేళ్ల మాదిరిగానే ఈ సారి కూడా తమపై పన్ను భారాన్ని తగ్గిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగేందుకు, పన్ను వసూళ్లకు బూస్టప్ ఇచ్చేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతారని ఆశగా ఉన్నారు. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలు కోసం ప్రభుత్వం తెస్తుందని భావిస్తోన్న ఐదు పన్ను ప్రయోజనాలు…
- ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు 5 లక్షల వరకున్న ఆదాయానికి పన్ను చెల్లించక్కర్లేదు. వారికి వస్తోన్న రిబేట్ రూ.12,500తో ఈ పన్ను మినహాయింపు పొందుతున్నారు. కానీ బేసిక్ మినహాయింపు పరిమితిని రూ.2,50,000 నుంచి రూ.5,00,000లకు పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీంతో పన్ను చెల్లింపుదారులందరికీ ఊరట కలుగుతుంది.
- చాప్టర్ 6ఏ డిడక్షన్స్ పెంపు చేపట్టాలని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తోంది. దీన్ని రూ.1,50,000 నుంచి రూ.2 లక్షలకు పెంచాలని భావిస్తోంది. దీంతో పెట్టుబడులను, సేవింగ్స్‌ను ప్రోత్సహించాలనుకుంటోంది.
- నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) పన్నులనూ రేషనలైజ్ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. 2018 డిసెంబర్ 6న జరిగిన కేబినెట్ మీటింగ్‌లోనే ఈ ఎన్‌పీఎస్ ట్యాక్సేషన్ నిబంధనలను మార్చేందుకు ఆమోదించింది.
- గతేడాది వరకు ఈక్విటీ షేర్లను లేదా ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్‌ను అమ్మడం ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలకు పన్ను నుంచి మినహాయింపు ఉండేది.2018–19 నుంచి మాత్రం లక్ష దాటిన ఆ లాభాలకు కూడా 10 శాతం పన్ను పడుతోంది. మరింత మంది ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి లక్ష రూపాయల మినహాయింపు పరిమితిని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి
- తాత్కాలిక బడ్జెట్‌లోనే మరింత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చేపడతామని ఎన్డీయే సర్కార్ హామీ ఇచ్చింది. ఈ మేరకు టెక్నాలజీని వాడుకుంటూ పన్ను రిటర్న్‌ల ప్రొసెసింగ్‌ను చేపట్టడం.. బిగ్ డేటా, అనలటిక్స్ వంటి డిజిటల్ టూల్స్‌తో పన్ను చెల్లింపుదారుల డేటాను సేకరించడం, పరిశీలించడం.. అంతేకాకుండా ఇతర సోర్స్‌ల ద్వారా వచ్చే సమాచారంతో పన్ను చెల్లింపుదారులు ఇచ్చే సమాచారాన్ని సరిపోల్చడం వంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు.
