ప్రజాధనం దోచుకునే వారిపై చర్యలు తప్పవు

ప్రజాధనం దోచుకునే వారిపై చర్యలు తప్పవు

నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇవాళే హోలీ మొదలైందని అన్నారు. మహిళలు, యువత ఓట్ల వల్లే బీజేపీకి ఇంత భారీ మెజార్టీ సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మోడీ మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ప్రజల హృదయాలను చూరగొనేందుకు కార్యకర్తలు రాత్రి పగలన్న తేడా లేకుండా శ్రమించారన్న ప్రధాని.. వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

పాలనలో పారదర్శకత
బీజేపీపై నమ్మకం పెరిగినందునే ప్రజలు తమకు ఓటు వేశారని ప్రధాని అన్నారు. గతంలో ప్రజలు కనీసావసరాల కోసం ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. పాలనలో పారదర్శకత తెచ్చి సుపరిపాలన అందించామని అన్నారు. గతంలో డబ్బులు పెట్టనిదే పనులయ్యేవి కాదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పేదల పక్షపాత ప్రభుత్వం అయినందునే ప్రజలు ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టారని చెప్పారు. 

ఉత్తర్ప్రదేశ్లో కొత్త చరిత్ర
మహిళల ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చిన చోట బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ఎంతో మంత్రి ప్రధానులను ఇచ్చినప్పటికీ.. ఒక ముఖ్యమంత్రి రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారని అన్నారు. 37ఏ ళ్ల తర్వాత బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని చెప్పారు. 

నలుదిక్కుల నుంచి బీజేపీకి ఆశీర్వాదం
బీజేపీకి హిమాలయాల నుంచి గోవా వరకు మద్దతు లభించిందని నరేంద్రమోడీ అన్నారు. దేశం నలుదిక్కుల నుంచి బీజేపీకి ఆశీర్వాదం లభించిందని చెప్పారు. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో తమ బలం మరింత పెరిగిందన్న ప్రధాని.. గోవా ప్రజలు మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు.

వారసత్వ రాజకీయాలకు అంతం
ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని యూపీలో రుజువైందని మోడీ అన్నారు. పేదలకు కూడు, గూడు, వ్యాక్సిన్ అందించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. దేశంలో అవినీతి అంతం కావాల్సిందేనన్న మోడీ.. ప్రజాధనం దోచుకునే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదో ఒకరోజు వారసత్వ రాజకీయాలు అంతంకాక తప్పవని అబిప్రాయపడ్డారు.