మళ్లా తెరపైకి సెంటిమెంట్ పాలిటిక్స్​ స్టార్ట్​

మళ్లా తెరపైకి సెంటిమెంట్ పాలిటిక్స్​ స్టార్ట్​
  • ఆంధ్రా లీడర్లు, ఢిల్లీ గులాములు, 
  • తెలంగాణ ద్రోహులు అంటూ బీఆర్​ఎస్​ క్యాంపెయిన్
  • ఢిల్లీ పార్టీలకు ఓటెందుకెయ్యాలంటున్న కేసీఆర్​
  • ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు నడుమ యుద్ధమంటున్న కేటీఆర్​
  • తెలంగాణ ద్రోహులంతా మిలాఖత్​ అయ్యిన్రంటున్న హరీశ్​రావు
  • పార్టీ పేరు మార్చుకున్నంక ఇంకా రెచ్చగొడ్తే ప్రజలు నమ్మరంటున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ ‘సెంటిమెంట్’  పాలిటిక్స్​ స్టార్ట్​ అయ్యాయి. మొన్నటి దాకా సంక్షేమం, డెవలప్​మెంట్​ మీద నడిచిన బీఆర్​ఎస్ నేతల​ క్యాంపెయిన్.. ఉన్నట్టుండి దిశమార్చుకున్నది. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను అప్పగిద్దామా? గులాములమవుదామా? తెలంగాణ ద్రోహులంతా మిలాఖత్​ అయిన్రు.. అంటూ బీఆర్ఎస్​ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. కేటీఆర్​, హరీశ్​తోపాటు కేసీఆర్​ కూడా ఇదే పంథాను ఎంచుకున్నట్లు ప్రసంగాలను చూస్తే తెలుస్తున్నది.

స్పీచుల్లో పదును తగ్గిందన్న ఫీడ్​ బ్యాక్​తోనే ఇట్ల సెంటిమెంట్​ వైపు కేసీఆర్​ కూడా టర్న్​ తీసు కున్నట్లు పొలిటికల్​ సర్కిల్స్​లో చర్చ జరుగుతున్నది. 2014, 2018 ఎన్నికల మాదిరిగానే  ఇప్పుడూ ‘సెంటిమెంట్’​తో ముందుకెళ్తే వర్కౌట్​ అవుతుందన్న ఆలోచనలో బీఆర్​ఎస్​ ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, పార్టీ నుంచి ‘తెలంగాణ’ పదాన్ని తీసేసిన కేసీఆర్​కు, గులాబీ నేతలకు ఇప్పుడు ‘తెలంగాణ’ సెంటిమెంట్​ ఎత్తుకునే అర్హత లేదని, వాళ్ల మాటలను ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితుల్లో లేరని ప్రతిపక్షాలు అంటున్నాయి.  

బీఆర్​ఎస్​గా మార్చి..ఆంధ్రాకు అధ్యక్షుడ్నీ నియమించి..!

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్​ఎస్​)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్​)గా మార్చి, జాతీయ రాజకీయాల్లో వస్తున్నామని ఏడాది కింద కేసీఆర్​ ప్రకటించారు. ఢిల్లీలో బీఆర్​ఎస్​ కోసం ఆఫీసు కూడా కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని కూడా నియమించారు. మహారాష్ట్రలో అనేక సభలు కూడా పెట్టారు. ప్రత్యామ్నాయ కూటమి అంటూ ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను కలిశారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా గేర్​ మార్చేశారు. ఆంధ్రా లీడర్లు, తెలంగాణ ద్రోహులు, ఢిల్లీ గులాములు అంటూ ప్రసంగాలు స్టార్ట్​ చేశారు. 

సడన్​ చేంజ్​!

కేసీఆర్​ మొదటి విడత సభల్లో  డెవలప్​మెంట్​, వెల్ఫేర్​ పైనే ఆయన ఎక్కువగా మాట్లాడారు. దీనికి జనం నుంచి అంతగా స్పందన రాలేదని ఆ పార్టీ నేతలకు ఫీడ్​ బ్యాక్​ అందింది. దీంతో రెండో విడత ప్రచారంలో మార్పులు చేశారు. సత్తుపల్లి సభలో ఏపీ రోడ్ల పరిస్థితులపై కేసీఆర్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్’’ అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఈ ఎన్నికలు ‘‘ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం” అంటూ మంత్రి కేటీఆర్​ కామెంట్స్​ చేశారు. ఢిల్లీ దొరలకు తెలంగాణ తలవంచదని ఆయన అన్నారు.  

కేసీఆర్​ తన ప్రసంగాల్లో రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే అని చెప్తున్నారు. ‘‘ఢిల్లీ పార్టీలకు ఓటెందుకెయ్యాలి? బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల్లో ఎవడన్నా తెలంగాణ జెండా ఎత్తిండా? ఉద్యమాన్ని భుజాన వేసుకున్నడా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమానపరిచిన్రు. ఈ ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాములమవుదామా” అంటూ స్పీచ్​లు ఇస్తున్నారు. నాలుగురోజుల కింద సంగారెడ్డిలో మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులంతా ఒక్కటైతున్నరని వ్యాఖ్యానించారు. 

తిప్పికొడ్తున్న ప్రతిపక్షాలు 

కేసీఆర్‌‌ ప్రయోగించే తెలంగాణ సెంటిమెంట్ వ్యూహా నికి కాలం చెల్లిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఏమార్చడానికే మరోసారి తెలంగాణ, -ఆంధ్రా సెంటిమెంట్‌‌ రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ను రద్దు చేసి బీఆర్​ఎస్‌‌గా మార్చుకొని ఇతర రాష్ట్రాల్లో పోటీకి దిగుతామ ని చెప్పిన కేసీఆర్​ మాటలను గుర్తుచేస్తున్నారు. బీఆర్​ఎస్​ సెంటిమెంట్​ రాజకీయాలను ప్రచారంలో కాంగ్రెస్​, బీజేపీ, బీఎస్పీ తిప్పికొడ్తున్నాయి.