
- తాత్కాలిక క్యాలెండర్‌లో కనిపించని భాగ్యనగరం పేరు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఫార్ములా–ఈ రేస్‌కు మంచి స్పందన వచ్చింది. సిటీలో నాలుగేండ్ల పాటు రేసులు నిర్వహించేలా ఫార్ములా–ఈతో తెలంగాణ ప్రభుత్వం, లోకల్ ఆర్గనైజర్ ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, 2024 సీజన్ కోసం ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ రూపొందించిన ప్రాథమిక ఫార్ములా–ఈ క్యాలెండర్‌లో హైదరాబాద్ పేరు లేదు. పూర్తి స్థాయి క్యాలెండర్‌ను అక్టోబర్‌లో ఎఫ్‌ఐఏ ఆమోదించాల్సి ఉన్నప్పటికీ పదో సీజన్ తాత్కాలిక జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రేస్ ఫైనల్ క్యాలెండర్‌లో హైదరాబాద్‌ను చేర్చడానికి చర్చలు జరుగుతున్నాయని ఫార్ములా–ఈ కో ఓనర్ అల్బెర్టో లాంగో తెలిపారు. సిటీలో నిర్వహించిన రేసు సక్సెస్ అయినప్పటికీ కొన్ని విషయాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, కొత్త సెక్రటేరియట్ చుట్టూ ఏర్పాటు చేసిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌పై ఫిబ్రవరిలో జరిగిన రేసు చూసేందుకు జనాలు పోటెత్తారు. కానీ, సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డారు. మెయిన్ రేసు ముందు రోజు వరకూ సర్క్యూట్ పనులు జరగ్గా.. టాయిలెట్స్ వంటి కనీస సదుపాయాలు కూడా సరిగ్గా లేవని డ్రైవర్లు సైతం ఫిర్యాదు చేశారు.