V6 News

ఇవాళ మానవ హక్కుల దినోత్సవం: ఇవి మీ హక్కులు.. ఈ విషయం ఎంత మందికి తెలుసు..!

ఇవాళ మానవ హక్కుల దినోత్సవం: ఇవి మీ హక్కులు.. ఈ విషయం ఎంత మందికి తెలుసు..!

కులం, మతం, జాతి, రంగు.. ఇలాంటి వేటితోనూ సంబంధం లేకుండా, ఈ భూమ్మీద ప్రతి మనిషికీ బతికే హక్కు ఉంది. ఏ దేవుడికైనా మొక్కుకోవచ్చు. ఏ మతానైనా స్వీకరించవచ్చు.. మాట్లాడే హక్కు ఉంది. చదువుకునే హక్కు ఇంది. అడ్డుకునే హక్కు ఉంది. అలాంటి ఎన్నో మానవ హక్కులు మనిషికి ఉన్నాయి. అవేంటి మీకు తెలుసా..? మానవ హక్కుల గురించి చెప్పే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ డాక్యుమెంట్‎ను ప్రస్తుతానికి 370 పైగా భాషల్లో అనువదించారు.

దాదాపు ఎనిమిది కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. ఆరేళ్లపాటు ఈ దేశం, ఆ దేశం అని లేకుండా యుద్ధంలో భాగమైన ప్రతి దేశం చావులను చూసింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఐక్యరాజ్యసమితిని స్థాపించుకున్నాయి. ఆ సంస్థ ఆలోచన నుంచి పుట్టినవే మానవ హక్కులు.

మానవ హక్కులంటే..?

మానవ హక్కులంటే దేశం భాష, జాతి, మతం, కులం.. వేటితో సంబంధం లేకుండా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉండే హక్కులు. స్వేచ్చగా బతకడం. ఎవ్వరికీ బానిసగా బతకాల్సిన అవసరం లేకుండా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడం. చదువుకోవడం, పని చేసుకో వడం. ఇవన్నీ మానవ హక్కులే. ఈ హక్కులు పొందడంలో ఎవరిపైనా వివక్ష ఉంచకూడదు. అందరికీ సమానం. ఒకవేళ ఎవరైనా తమ హక్కులను పొందలేని పరిస్థితుల్లో ఉంటే కోర్టుకు వెళ్లవచ్చు. ఒక మనిషి హక్కును ఇంకో మనిషి లాక్కొని, ఆ వ్యక్తిని బానిసలా చూస్తే అది హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. చట్ట ప్రకారం శిక్షలు కూడా పడతాయి. 

ALSO READ : కమ్ముకున్న యుద్ధ మేఘాలు!

అన్ని దేశాలది ఒక్కటే మాట:

మానవ హక్కుల విషయంలో ఐక్యరాజ్యసమితిలో భాగమైన 192 దేశాలది ఒక్కటే మాట. అన్ని దేశాలు హక్కుల ఉల్లంఘనకు ఒక్కటే చట్టాన్ని ఫాలో అవుతున్నాయి. 1948లో మానవ హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన యూనివర్సల్ డిక్లరేషన్ డాక్యుమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి మనుషులుగా బతకడానికి ఒక ఆధారాన్నిచ్చింది. డిసెంబర్ 10న ఇది అమల్లోకి వచ్చింది. అంటే నేటికి 77 సంవత్సరాలు. మరీ 77 ఏళ్లుగా అమల్లో ఉన్న మానవ హక్కులు అందరి జీవితాలను మార్చాయా..?

హక్కులు అందరివీ..

"చాలా చిన్న ఉల్లో, చిన్న ఇంటి దగ్గర ఒక మహిళనా, పురుషుడైనా, చిన్న పిల్లలైనా హాయిగా జీవించగ లగాలి. వాళ్ల హక్కులేంటో వాళ్లకు తెలియాలి. ఏ వివక్షా లేని ప్రపంచంలో ఒక మనిషి తనకు వచ్చే అవకాశాలను అందుకుంటూ, గౌరవాన్ని పొందుతూ బతకడం అ మనిషి సమాజం నుంచి పొందాల్సిన హక్కు. అది చిన్న ఊళ్లో దొరికితే, ప్రపంచంలోని ప్రతి మూల దొరికితే మనిషి హాయిగా బతుకుతున్నట్లు" మానవ హక్కులను ప్రవేశపెట్టడానికి పోరాడిన వాళ్లలో ఒకరైన ఎలియన్ రూజ్ వెల్ట్ చెప్పిన మాట ఇది.

ఈ డెబ్బై ఏడేళ్ల కాలంలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్లందరూ చెప్పేమాట కూడా ఇదే. కాకపోతే ఇప్పటికీ మానవ హక్కులను తెలుసుకోనివాళ్లు, వాటిని ఉల్లంఘిస్తున్న వాళ్లు, తమకు ఇలాంటి హక్కు ఒకటి ఉందని కూడా తెలియని వాళ్లు లెక్కలేనంత మంది ఉన్నారు. దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పౌరులకు హక్కులు గురించి అవగాహన కల్పిస్తున్నాయి.

ఇప్పటికీ అదే బానిసత్వంలో..

దేశాలు, ప్రభుత్వాలు కలిసి ఇన్ని హక్కులను తీసుకొచ్చినా ఇవ్వాల్టికి 4 కోట్ల మంది చిన్నారులు వెట్టి చాకిరీ చేస్తున్నారు. దాదాపు 23 కోట్ల మంది పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తూ ఆడుకోవాల్సిన, చదువుకోవాల్సిన తమ హక్కులను కోల్పోతున్నారు. రెండున్నర కోట్ల మంది ఆడవాళ్లు హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కుకొని స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోతున్నారు. ఇవన్నీ సామాజిక సమస్యలతో, రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్నవి. ఇవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మామూలుగా బతికే హక్కును కూడా కోల్పోతున్నారు. మానవ హక్కులు అమల్లోకి వచ్చి 77 ఏళ్లయినా ఈ పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో మారలేదు. హక్కుల ఉల్లంఘనపై పోరాడేందుకు ప్రతి పౌరుడూ తమకున్న హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మానవ హక్కుల్లో అందరూ తెలుసుకోవాల్సినవి కొన్ని:

  • పుట్టుకతో అందరూ సమానం. అందరికీ స్వేచ్ఛ, సమాన హక్కులు ఉంటాయి. 
  • ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది.
  • బానిసత్వం, వెట్టిచాకిరీ కాదనడం మానవ హక్కు
  • మీ హక్కులకు అడ్డుపడితే న్యాయం కోసం కోర్టుకు వెళ్లొచ్చు.
  • ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువయ్యే వరకు అతడు నిందితుడు కాదు.
  • దేశం మొత్తం మీద ఎక్కడికైనా వెళ్లి బతికే హక్కు ఉంది.
  • ఒకవేళ సొంత దేశంలో బతికే పరిస్థితి లేకపోతే వేరే దేశం వెళ్లి బతికే హక్కు ఉంది.
  • ఒక దేశానికి చెందినవాడిగా గుర్తింపు పొందే హక్కు అందరికీ ఉంది.
  • ఆడుకునే విషయంలో, పెళ్లి చేసుకొని విషయంలో, ఫ్యామిలీని ఏర్పాటు చేసుకునే విషయంలో ఇలా ఎన్నో విషయాల్లో మనిషికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను వదులుకో వద్దు.

 మానవ హక్కుల దినోత్సవం–2025 థీమ్: హ్యూమన్ రైట్స్, అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ (Human Rights, Our Everyday Essentials)