- బుధవారం అర్ధరాత్రికి దర్శనాలు క్లోజ్
- నేడు నిమజ్జనం కోసం ఏర్పాట్లు
- రేపు ‘మహా నిమజ్జనం’
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, వెలుగు : మహా గణనాథుడి దర్శనానికి భక్త జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్గణేశుడిని దర్శించుకోవడానికి 10 రోజుల్లో సుమారు 25 లక్షలకు పైగా భక్తులు క్యూ కట్టారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కదిలివచ్చారు. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది దర్శించుకుని తరలించారు.
సెప్టెంబర్ 25న నిమజ్జనం ఉండటంతో 24న ఏర్పాట్లు చేయాల్సి ఉందని, భక్తులు వస్తే ఆటంకం కలుగుతుందని బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకే దర్శనానికి అవకాశం కల్పించారు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో భారీగా భక్తులు కనిపించారు. లక్డీకపూల్చౌరస్తా నుంచి, ఇటు ఖైరతాబాద్మెట్రో స్టేషన్నుంచి భారీ లైన్లు కనిపించాయి. బుధవారం మధ్యాహ్నం భారీగా వర్షం కురిసినా తడుస్తూనే లైన్లలో నిల్చున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు గణేశుడి మండపం చుట్టుపక్కల కిలోమీటర్ల దూరంలో ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు కనిపించారు. చివరి రోజు మహాగణపతిని డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్, బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్దర్శించుకున్నారు.
యాత్ర సమయం 7 గంటలు...
కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల మేర సాగే ఈ శోభాయాత్రకు సుమారు 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. భారీ టస్కర్‌ను నడిపేందుకు సూర్యాపేట నుంచి ప్రత్యేకంగా డ్రైవర్ వెంకటరెడ్డిని రప్పించారు. ఇప్పటివరకు ఆయన మూడు సార్లు మహా గణేశ్శోభాయాత్రలో పాల్గొన్నారు. సాధారణ డ్రైవింగ్‌కు, శోభాయాత్రకు చాలా తేడా ఉంటుందని, వేలాది మంది భక్త జనసందోహం మధ్య వాహనాన్ని ఎంతో ఆచితూచి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని, ఇది తనకో సవాల్అని ఆయన పేర్కొన్నారు.
నిమజ్జన రూట్ మ్యాప్ ఇదే..
బడా గణేశ్శోభాయాత్ర సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటలకు మండపం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతిసారి లెక్కనే ఖైరతాబాద్ గణేశ్ మండపం నుంచి మొదలై..సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా మీదుగా లుంబినీ పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకుంటుంది. నిమజ్జనాన్ని మధ్యాహ్నం 12 గంటలలోపే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రత్యేకంగా అత్యంత శక్తివంతమైన లాంగ్-బూమ్ మెకానికల్ క్రేన్ నంబర్ 4 ను సిద్ధం చేశారు. విగ్రహం ఎత్తు దృష్ట్యా శోభాయాత్ర రూట్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విద్యుత్ వైర్లను సరిచేసి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను ఇప్పటికే కత్తిరించారు.
మహా గణపతిని తరలించే టస్కర్ వచ్చేసింది
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ఏపీ నుంచి భారీ టస్కర్ వచ్చేసింది. సుమారు 40 నుంచి 50 టన్నుల బరువున్న భారీ మహా గణపతి విగ్రహాన్ని తరలించేందుకు సాధారణ ట్రక్కులు సరిపోవు. అందుకే ప్రతిసారి ఏపీలోని విజయవాడ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 26 చక్రాల భారీ ‘టస్కర్’ రప్పించారు. దాదాపు 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు , 100 టన్నుల బరువును మోసే ఈ టస్కర్ పై గణనాథుడిని నిలిపేందుకు బుధవారమే వెల్డింగ్ పనులు మొదలుపెట్టారు. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా.. విగ్రహం కదలకుండా నిశ్చలంగా ఉండేందుకు వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. విగ్రహం అడుగుభాగంలో పటిష్టంగా ఉండేలా ఐరన్ స్తంభాలతో పక్కా బేస్ ఏర్పాటు చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారని, వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ పనులు పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
