- గత ఆరు నెలల్లో 156 బిలియన్ డాలర్ల నుంచి 131 బిలియన్ డాలర్లకు పడిన మార్కెట్ క్యాప్
- బ్యాంక్ షేర్లు కొనొచ్చంటున్న ఎనలిస్టులు
న్యూఢిల్లీ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు గత నెల రోజుల్లో 15 శాతం క్రాష్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ తగ్గుతోంది. కిందటేడాది జులైలో 156.2 బిలియన్ డాలర్లుగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్, తాజాగా 131 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. కేవలం 35 కంపెనీల మార్కెట్ క్యాప్ మాత్రమే 25 బిలియన్ డాలర్లు (రూ.2.07 లక్షల కోట్ల) కంటే ఎక్కువ ఉంది. కేవలం ఆరు నెలల్లోనే ఇటువంటి పెద్ద కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానమైన వాల్యూని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కోల్పోయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఫారిన్ ఇన్వెస్టర్లకు వాటాలు ఎక్కువ. తాజాగా నికర అమ్మకందారులుగా మారిన వీరు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 16 శాతం పడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ పతనానికి కారణమయ్యింది. ఈ ఏడాది నిఫ్టీ బ్యాంక్ పతనంలో 67 శాతం ఈ బ్యాంక్ షేర్ల వాటానే ఉంది.
నిఫ్టీ బ్యాంక్‌లో ఈ బ్యాంక్ వెయిటేజ్ 38 శాతం కాగా, నిఫ్టీ 50 లో 12 శాతం. అయినప్పటికీ మార్జిన్స్ కాపాడుకోవడంపై, లాంగ్ టెర్మ్ గ్రోత్‌పై బ్యాంక్ మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది. బ్యాంక్ డిపాజిట్లు కూడా డిసెంబర్ క్వార్టర్లో 19 శాతం పెరిగాయి. దీంతో చాలా మంది ఎనలిస్టులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను లాంగ్ టెర్మ్ కోసం కొనుక్కోవాలని సలహా ఇస్తున్నారు. తాజా షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 52.3 శాతం వాటా ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) చేతిలో ఉంది. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ మరో 19.5 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. 9 శాతానికి పైగా వాటా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఉంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో వాటాలు పెంచుకోవడంపై ఎల్ఐసీకి అనుమతి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 9.99 శాతం వరకు వాటాను పెంచుకోవడంపై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 24 లోపు ఈ వాటాల కొనుగోలును పూర్తి చేయాలని సలహా ఇచ్చింది. రూల్స్ ప్రకారం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్‌లో ఎల్ఐసీ వాటా 9.99 శాతాన్ని మించకూడదు. బీఎస్ఈ డేటా ప్రకారం, కిందటి నెల 31 నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఎల్ఐసీకి 5.19 శాతం వాటా ఉంది.