
- 153 ఆయుధాలు అప్పగింత..
రాజ్యాంగం, గులాబీలతో ఆహ్వానించిన పోలీసులు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న శుక్రవారం చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. బస్తర్ జిల్లా జగదల్పూర్ రిజర్వ్ పోలీసుహెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశన్నతోపాటు 208 మంది మావోయిస్టులు ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు.
దేశ చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు అని చత్తీస్గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ ప్రకటించారు. దండకారణ్యంలోని అబూజ్మడ్ నుంచి ఇంద్రావతి నదిని పడవల ద్వారా దాటి వచ్చిన సాయుధ మావోయిస్టులను పోలీసులు మూడు ప్రత్యేక బస్సుల్లో జగదల్పూర్కు తరలించారు.
ఆశన్నను ప్రత్యేకంగా కారులో తీసుకొచ్చారు. యూనిఫామ్‌లు ధరించి బస్సుల నుంచి దిగిన మావోయిస్టులకు రాజ్యాంగ పుస్తకంతో పాటు, గులాబీ పువ్వును ఇచ్చి పోలీసులు ఆహ్వానించారు. ఆశన్నతో పాటుగా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ అలియాస్ రాజ్మాన్ మండవి, రణిత, రాజుసలాం, ధన్నూ వెట్టి, రీజనల్ కమిటీ మెంబర్ రతన్ అలాం అడవి విడిచి బయటకు వచ్చారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.
కేంద్ర కమిటీ సభ్యులు ఒకరు, నలుగురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒకరు రీజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ మెంబర్లు, 21 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 98 మంది పార్టీ సభ్యులు, 22 మంది పీఎల్జీఏ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరు 153 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో 19 ఏకె-47లు, ఎస్ఎల్ఆర్లు 17, ఇన్సాస్లు 23, ఎల్ఎంజీ 1, 303 రైఫిల్స్ 36, నాలుగు కార్బైన్లు, ఒక యూబీజీఎల్ ఉన్నాయి.
మూడేండ్లు ఆర్థిక సాయం
లొంగిపోయిన మావోయిస్టులపై చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి వరాల జల్లు కురిపించారు. అందరికీ ఇండ్లు, వ్యవసాయ భూమితో పాటు మూడేండ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మెరుగైన పునరావాస ప్యాకేజీని అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. పారిశ్రామిక పాలసీ ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి యూనిట్లు పెట్టుకునేందుకు సాయం అందిస్తామన్నారు.
డీఆర్జీ పోలీస్ విభాగంలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్‌ను ఆదేశించారు. అన్నలు దేశాభివృద్ధిని కోరుతూ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారని, వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులతో సుఖశాంతులతో ఉండేలా మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. బస్తర్‌లోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామని, కరెంట్ ఇచ్చామని, ఇంటికే రేషన్ వెళ్తున్నదని, బస్తర్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్‌శర్మ మాట్లాడుతూ.. ఆశన్న లొంగుబాటుతో అబూజ్మడ్ డివిజన్ లోని మావోయిస్టులంతా బయటకు వచ్చేసినట్టేనని ప్రకటించారు. గడ్చిరోలికి చెందిన సభ్యులు లొంగిపోయారని, ఇక కేశ్కాల్ కమిటీ మాత్రమే మిగిలి ఉందని, త్వరలో వారు కూడా సరెండర్ అవుతారన్నారు.
కమ్యూనికేషన్, జోనల్ డాక్టర్ టీమ్‌లు కూడా బయటకు వచ్చేశాయని, ఉత్తర, పశ్చిమ డివిజన్ కమిటీలు కూడా ఖాళీ అయ్యాయని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లక్ష్యం మేరకు 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామని వెల్లడించారు.