నిధులు రావట్లే.. ప్రారంభించట్లే !

నిధులు రావట్లే.. ప్రారంభించట్లే !
  • ప్రశ్నార్థకంగా  సివిల్ సర్వీస్ అకాడమీ సెంటర్ ​ఏర్పాటు
  • హడావుడిగా ‘ఈక్వల్ ఆపర్చునిటీ’ కోచింగ్ ​సెల్​మూసివేత 
  • ఉచిత కోచింగ్ కోసం నిరుద్యోగులు, స్టూడెంట్ల​ఎదురుచూపు

సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 21 పాయింట్​ఫార్ములా విజన్​ను  రూపొందించగా కాగితాలకే పరిమితమైంది. ప్రతిపాదిత ప్రణాళికల్లో ఏ ఒక్కటి నెరవేరట్లేదు. ఈ కేంద్రాన్ని  రూ.50 లక్షల బడ్జెట్ తో ప్రారంభిస్తామని చెప్పిన ఆఫీసర్లు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో  సివిల్​సర్వీసెస్​అకాడమీ  అమలుకు నోచుకోవడం లేదు. అకాడమీని త్వరలోనే  ప్రారంభిస్తామని, ప్రతి ఏటా రూ.50 లక్షల బడ్జెట్​కేటాయిస్తామని ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టినపుడు మీడియాకు చెప్పారు.  జువాలజీ డిపార్ట్​మెంట్​సమీపంలోని పాత వర్క్​షాప్ షెడ్డుకు రిపేర్లు కూడా చేయించారు. గత జనవరి 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా అప్పటి వరకు కొనసాగిన ఈక్వల్​ఆపర్చునిటీ కోచింగ్​సెల్​ను కూడా మూసివేశారు. ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కావాల్సిన సౌకర్యాలు, ఫ్యాకల్టీ, బడ్జెట్ పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న స్టూడెంట్స్​నిరాశతో ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది. కేంద్రంలో సివిల్స్ తో పాటు​రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలంటే ఏడాదికి కనీసం కోటి రూపాయల బడ్జెట్​కేటాయిస్తేనే నిర్వహణ సాధ్యమని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. 

క్వాలిఫయింగ్​ జాబితాలోను దక్కని చోటు 
ఒకప్పుడు సివిల్​సర్వీసెస్​పరీక్షల్లో టాప్​ర్యాంకులో నిలిచిన ఓయూ, ఇప్పుడు కనీసం క్వాలిఫయింగ్​​జాబితాలో కూడా చోటు పొందలేదు. దీనిని అధిగమించాలని ఓయూ వీసీ 21 పాయింట్స్​ఫార్ములాతో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా సివిల్​సర్వీసెస్​అకాడమీ ఏర్పాటుకు నిర్ణయించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై, ముఖ్యంగా ఇంగ్లీష్​ లాంగ్వేజ్​పై ట్రైనింగ్​ ఇచ్చి వారిని జాతీయస్థాయిలో పోటీల్లో నిలిచేలా తయారు చేయాలనే లక్ష్యంతో  కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నుంచే సివిల్స్​ప్రిలిమినరీ పరీక్షలకు పోటీ పడే వారికి శిక్షణ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కేంద్రంలో ఓయూ క్యాంపస్​స్టూడెంట్స్​తో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్​పీజీ కాలేజీలు, కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీ, హైదరాబాద్​ కాలేజీల్లో సీట్లు పొందిన  గ్రామీణ ప్రాంతాలకు చెందిన  750 మంది  స్టూడెంట్స్​కు శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

సెంటర్​నిర్వహణకు రూ.5 లక్షల నిధులే..​
హడావుడిగా సివిల్ సర్వీసెస్​ అకాడమి ప్రారంభిస్తామని ప్రకటించిన వీసీ ​నిధులను వర్సిటీ బడ్జెట్​ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు పంపగా, రూ.5లక్షలు విడుదల చేసేందుకు అంగీకరించింది. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించడంతో సివిల్స్, గ్రూప్–​-1, గ్రూప్–-2 వంటి పోటీ పరీక్షలకు కోచింగ్​ఇచ్చే ఫ్యాకల్టీ చాలా రెమ్యునరేషన్​డిమాండ్​ చేస్తున్నారని, దీంతో ఈ డబ్బులు ఏ మాత్రం సరిపోవని చెబుతున్నారు. ఒక వేళ ప్రారంభిస్తే సరైన ఫ్యాకల్టీ దొరకక ఫెయిల్యూర్​అయ్యే ప్రమాదముందని భావిస్తున్నట్లు సమాచారం.

వెంటనే కోచింగ్​ సెంటర్  ప్రారంభించాలె 
ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించడంతో  నిరుద్యోగులు, స్టూడెంట్స్​రెడీ అవుతున్నారు. పోటీని తట్టుకొని జాబ్​ కొట్టాలంటే కోచింగ్​తప్పనిసరి. ఆఫీసర్లు కోచింగ్​అకాడమీ ప్రారంభిస్తామని ప్రకటించి 9 నెలలు గడుస్తోంది. 3 నెలల క్రితం ప్రారంభించాల్సిన అకాడమీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వెంటనే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో అన్ని పోటీ పరీక్షలకు నిరంతరం కోచింగ్ ఇవ్వాలి. పెరుగుతున్న స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా రీడింగ్ హాల్స్​ పెంచాలి.
- కాంపెల్లి శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ నేత

నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం
ఓయూలో కోచింగ్​అకాడమీ నిర్వహణకు రూ. కోటి అవసరం ఉంటుంది. ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కోచింగ్​నిర్వహణకు అవసరమైన హాలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కోచింగ్​క్లాసులతో పాటు రీడింగ్​ రూములు,  లైబ్రరీ వంటి అరేంజ్​మెంట్స్​చేస్తున్నాం. నిధులు విడుదలైన వెంటనే ట్రైనింగ్​స్టార్ట్​చేస్తాం 
- ప్రొఫెసర్​గణేశ్, సివిల్​సర్వీసెస్​అకాడమీ డైరెక్టర్