Manchu Lakshmi: 'మహేష్ బాబును ఇదే ప్రశ్న అడగగలరా?'.. జర్నలిస్టుపై మంచు లక్ష్మీ ఫైర్!

Manchu Lakshmi: 'మహేష్ బాబును ఇదే ప్రశ్న అడగగలరా?'.. జర్నలిస్టుపై మంచు లక్ష్మీ ఫైర్!

మంచు లక్ష్మీ గురించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆమె ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ 'దక్ష: ఏ డెడ్లీ కాన్‌స్పిరసీ'  ప్రమోషన్స్‌లో  ఫుల్ బిజీగా ఉన్నారు..  ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో జనలిస్ట్ అడిగిన ప్రశ్నలకు చిర్రెత్తిపోయారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి అడిగిన ప్రశ్నకు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. ఇవేం ప్రశ్నలు అంటూ సీరియస్ అయ్యారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

"మహేష్ బాబును ఇదే ప్రశ్న అడుగుతారా?"

"మీరు ముంబై వెళ్లిన తర్వాత మీ డ్రెస్సింగ్ మారిపోయింది. 50 ఏళ్లకు దగ్గరవుతున్న ఓ మహిళ, 12 ఏళ్ల కూతురుకు తల్లి అయిన మీరు ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనాలు ఏమనుకుంటారు?" అని సదరు జర్నలిస్ట్ లక్ష్మిని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే లక్ష్మి తీవ్రంగా అసహనానికి గురయ్యారు. ఈ ప్రశ్నకు లక్ష్మి ఘాటుగా బదులిచ్చారు. "మీరు ఒక మగవాడిని ఇదే ప్రశ్న అడుగుతారా? మీకు అంత ధైర్యం ఉందా? మహేష్ బాబును కూడా 'మీకు ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి, ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నారు?' అని అడగగలరా? మరి ఒక మహిళను ఇదే విషయం ఎలా అడుగుతారు? మీరు అడిగే ప్రశ్నలనే చూసి జనాలు నేర్చుకుంటారు. ఒక జర్నలిస్ట్‌గా మీరు మరింత బాధ్యతగా ఉండాలి," అని గట్టిగా చెప్పారు.

 సూపర్ స్టార్ భార్య విడాకులు.. 

లక్ష్మి తన అభిప్రాయాన్ని కొనసాగిస్తూ, "మీరు అడగాల్సిన ప్రశ్నలు.. 'మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఇంకా పైకి ఎగరండి. మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా జీవించు లక్ష్మి,' అని చెప్పాలి. కానీ, మీరు హద్దులు గీస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఆడవారిని అడుగుతున్నారు అంటే మీరు అప్పటికే వారిని ఆపేస్తున్నారని అర్థం  అని అన్నారు. మన టాలీవుడ్‌లో ఒక సూపర్ స్టార్ భార్య విడాకులు తీసుకున్నాక సినిమాలు చేయలేకపోతున్నారు. ఆమెతో సినిమా తీయాలన్న.. మీ భర్త తరుపువారు ఏమంటారో అని నిర్మాతలు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. 

అలాగే పిల్లలు ఉన్న నటీమణులు.. వాళ్లు పెద్దవాళ్ళు అయ్యాక సినిమాల్లో చేస్తాం అని అంటున్నారు. ఇదే మాట మగవారు ఎందుకు చెప్పరు? అని లక్ష్మీ ప్రశ్నించారు. విడాకులు అయ్యాక మగవారికి జీవితం మామూలుగానే నడుస్తుంది. కానీ, ఆడవారికి అలా కాదు. పెళ్లి అయ్యాక, తల్లి అయ్యాక, కుటుంబం అని చాలా బాధ్యతలుంటాయి. వాటన్నింటి బాధ్యత మాపైనే ఉంటుంది. మాకు స్వేచ్ఛ ఎవరూ ఇవ్వరు. దాన్నీ మేమే వెతుక్కోవాలి. నాకు ఆ ఫ్రీడమ్ నాకు నచ్చిన బట్టల్లో ఉంటుంది, నాకు నచ్చిన విధంగా మాట్లాడటంలో ఉంటుంది," అని లక్ష్మి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.