
హైదరాబాద్: Group 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును TGPSC హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ తీర్పు వెల్లడించారు. రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్లో TGPSC బుధవారం అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు ప్రకారం రీవాల్యూయేషన్ చేస్తే అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని టీజీపీఎస్సీ భావిస్తున్నది. గ్రూప్-1 నియామక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, తమ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే..
గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకింగ్ లిస్ట్‌పై మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్‌ఎల్), మార్కుల జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మళ్లీ పేపర్లను దిద్దాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. వాటి ఆధారంగా 563 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ అది సాధ్యంకాకపోతే మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి, ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారందరికీ మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆదేశించింది.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ, వాటిని రద్దు చేయరాదంటూ దాఖలైన దాదాపు 12 పిటిషన్లపై విచారించిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సెప్టెంబర్ 9న 222 పేజీల తీర్పును వెలువరించారు. గతంలో పరీక్షలను రద్దు చేసినా కమిషన్ గుణపాఠాలు నేర్చుకోలేదని అన్నారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత కొనసాగించలేదని పేర్కొన్నారు. సొంత నియమ, నిబంధనలను ఉల్లంఘించడాన్ని తప్పుబట్టారు. కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నిరుద్యోగ యువత నష్టపోయిందని అన్నారు. ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేసి రోజుకు 10 నుంచి 12 గంటలపాటు కష్టపడి చదువుకున్నారని, కమిషన్ విధానపరమైన, మూల్యాంకన విధానం అమలు చేయడంలో విఫలమైందని, ఈ నిర్లక్ష్యాన్ని అనుమతించలేమని చెప్పారు.