కాంకేర్లో 21 మంది మావోయిస్టులు లొంగుబాటు

కాంకేర్లో 21 మంది  మావోయిస్టులు లొంగుబాటు
  • 18 ఆయుధాలను బస్తర్​ ఐజీకి అప్పగింత

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లా కేంద్రంలో ఆదివారం 21 మంది మావోయిస్టులు తమ వద్ద ఉన్న 18 ఆయుధాలతో సహా బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ పి ఎదుట లొంగిపోయారు. బస్తర్​ పరిధిలోని కేశ్​కాల్​ డివిజన్​లో ఉన్న క్యూమరి, కిస్కోడ ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు నార్త్  సబ్​ డివిజనల్​ బ్యూరో సెక్రటరీ ముఖేశ్  నేతృత్వంలో ఆయుధాలతో సహా వచ్చారు.

లొంగిపోయిన వారిలో నలుగురు డివిజనల్, తొమ్మిది మంది ఏరియా కమిటీ, 8 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మూడు ఏకె-47లు, నాలుగు ఎస్ఎల్ఆర్​ రైఫిల్స్, రెండు ఇన్సాస్​ రైఫిల్స్, ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్​ షాట్​ గన్స్, ఒక బీజీఎల్​ వెపన్​ను ఐజీకి అప్పగించారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ఐజీ వెల్లడించారు. మిగిలిన వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.