హైదరాబాద్, వెలుగు: ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల లెక్క తేలింది. ఈ విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు, 38,341 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. నాలుగు చోట్ల సర్పంచ్ స్థానాలకు, 88 చోట్ల వార్డు స్థానాలకు నామినేషన్లు రాలేదు.
దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు ఉండవు. మిగిలిన 4,328 సర్పంచ్ స్థానాలకు 21,035 నామినేషన్లు, 38,253 వార్డులకు 88,951 నామినేషన్లను అభ్యర్థులు సమర్పించారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 280 సర్పంచ్ స్థానాలకు 2,418 నామినేషన్లు, 2,418 వార్డులకు 5,756 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 52 సర్పంచ్ స్థానాలకు 244 నామినేషన్లు, 462 వార్డులకు 1,064 నామినేషన్లు వచ్చాయి.
