ఎఫ్పీవోలుగా 22 పీఏసీఎస్లు..మొదటి విడతలో కామారెడ్డి జిల్లా నుంచి ఎంపిక

ఎఫ్పీవోలుగా 22 పీఏసీఎస్లు..మొదటి విడతలో కామారెడ్డి జిల్లా నుంచి ఎంపిక
  • పంట ఉత్పత్తులు పెంచడం, గిట్టుబాటు ధరకు అమ్మడమే లక్ష్యం

కామారెడ్డి, వెలుగు: రైతులకు మెరుగైన సేవలు, పంట ఉత్పత్తుల పెంపు, అమ్మకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్​లు)ను ఫార్మర్​ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు( రైతు ఉత్పత్తిదారుల సంస్థలు–ఎఫ్​పీవోలు)గా మారుస్తోంది.  ఇందులో భాగంగా  కామారెడ్డి జిల్లాలో 55 సొసైటీలు ఉండగా మొదటి విడతలో  22 ఎఫ్​పీవోలుగా మారాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి.  ఆయా సంఘాల్లో ఇప్పుడు  నిర్వహిస్తున్న కార్యకలాపాలతో పాటు ఎఫ్​పీవో పనులు కూడా చేపట్టనున్నారు.  రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను విస్తరించడం దీని ముఖ్య ఉద్దేశం.  నిర్వహణకు ఫండ్స్​ఇవ్వడంతోపాటు వ్యాపార లావాదేవీలకు కేంద్రం ఒక్కో సొసైటీకి రూ.15 లక్షల షేర్​క్యాపిటల్​ఇస్తుంది. దీనికి సమానంగా రైతులు షేర్ క్యాపిటల్​పెట్టాలి. త్వరలోనే ఫార్మర్​ ప్రొడ్యూసర్​ఆర్గనైజేషన్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.  

500 మందికి తక్కువ కాకుండా సభ్యులు 

ఒక్కో ఎఫ్​పీవోలో 500 మందికి తక్కువ కాకుండా రైతులు సభ్యులుగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే షేర్​ క్యాపిటల్​అనుగుణంగా వీరు రూ.15 లక్షల వరకు షేర్​ క్యాపిటల్​ పెట్టాలి. ఈ అమౌంట్​ను సభ్యుల సంఖ్యకు అనుగుణంగా నిర్ణయిస్తారు. దీనితో పంట ఉత్పత్తులు పెంచే కార్యక్రమాలు నిర్వహించడం, శిక్షణ, ప్రాసెసింగ్, ఉత్పత్తుల కొనుగోళ్లు వంటివి చేపడుతారు. వ్యవసాయంలో వచ్చే మార్పులు,  టెక్నాలజీ ఉపయోగించి పంట ఉత్పత్తులను పెంచేందుకు ఎఫ్​పీవోలు పని చేస్తాయి. గిట్టుబాటు ధరకు వాటిని విక్రయించి, రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయనున్నారు.

ఎఫ్​పీవోలుగా మారిన సొసైటీలు ఇవే..

జిల్లాలో ప్రస్తుతం 55 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో నుంచి మొదటి విడతలో 22 సొసైటీలను ఫార్మర్​ ప్రొడ్యూసర్​ఆర్గనైజేషన్లుగా మారాయి. అవి కామారెడ్డి, మాచారెడ్డి,  భిక్కనూరు మండలం జంగంపల్లి,  బీబీపేట,  రాజంపేట మండలం ఆర్గొండ,  సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి,   లింగంపేట,  ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలం తాండూర్, బీర్కుర్, జుక్కల్, పిట్లం మండలంలోని చిల్లర్గి, దోమకొండ, బాన్సువాడ, డొంగ్లి, నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి, పెద్దకొడప్​గల్, మహమ్మద్ నగర్ మండలంలోని గున్గుల్ సంఘాలు.

రైతులకు  ఎంతో మేలు

ఇప్పుడున్న సొసైటీలకు అనుబంధంగా ఎఫ్​పీవోల కార్యకలాపాలు కొనసాగుతాయి.  వీటివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఫండ్స్ తదితర వ్యవహారాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. పంట ఉత్పత్తులను పెంచేలా రైతులకు ట్రైనింగ్​ఇస్తారు. – రామ్మోహన్​, జిల్లా సహకార అధికారి