దిక్కుతోచని స్థితిలో 22 వేల మంది వీఆర్ఏలు

దిక్కుతోచని స్థితిలో 22 వేల మంది వీఆర్ఏలు
  • నాలుగేండ్లు దాటినా.. వీఆర్ఏలకు పే స్కేల్ రాకపాయె!
  • వీఆర్వోల రద్దుతో ప్రమోషన్లకు బ్రేక్
  • గతంలో ప్రగతిభవన్​లో, ఏడాది కింద అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్  
  • దిక్కుతోచని స్థితిలో 22 వేల మంది వీఆర్ఏలు 
  • కామారెడ్డిలో వీఆర్ఏ ఆత్మహత్య.. కార్యాచరణకు సిద్ధమవుతున్న వీఆర్ఏలు

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో డ్యూటీ చేస్తున్న 22 వేల మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి నాలుగున్నరేండ్లు అవుతున్నా అమలు కావడం లేదు. ఏండ్లు గడిచినా జీతాలు పెరగకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్లతోపాటు సర్వీస్ సీనియార్టీ ఉన్నా డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్‌‌ వీఆర్ఏలు ప్రమోషన్లకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది జనవరిలో రెవెన్యూ శాఖలో 190 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రమోషన్లు ఇచ్చి మిగతా కేడర్​ వారిని పక్కన పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ రూపకల్పన ద్వారా రెవెన్యూ శాఖలో రిఫామ్స్ తెచ్చిన సర్కార్.. ఆ శాఖ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. 

రెండు సార్లు హామీ..  
రెవెన్యూ శాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న వీఆర్ఏల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్ తొలిసారిగా హామీ ఇచ్చారు. పే స్కేల్ హామీ నెరవేర్చకుండా రూ.6,500 వేతనాన్ని రూ.10,500కు పెంచారు. తర్వాత రెగ్యులరైజేషన్ మాట మరిచారు. 2020 సెప్టెంబర్‌‌‌‌లో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పి 14 నెలలు దాటినా హామీ నెరవేరలేదు. తాజాగా పీఆర్సీ ప్రకారం 30% వేతన పెంపు వీఆర్ఏలకు వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. దీంతో సీనియార్టీని బట్టి రూ.13 వేల నుంచి రూ.14 వేలు మాత్రమే వేతనం పెరగనుంది. పీఆర్సీతో సంబంధం లేకుండా రూ.19 వేల మినిమం పే స్కేల్ వర్తింపజేసి, సీఎం హామీని నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు కోరుతున్నారు. పే స్కేల్ అమలు కావడం లేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్(ఎం) గ్రామానికి చెందిన వీఆర్ఏ సల్ల రమేశ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడడంతో వీఆర్ఏలంతా రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. ఈ విషయంలో సర్కార్​పై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.  

ప్రమోషన్లు బంద్.. 
గతంలో సీనియార్టీ, క్వాలిఫికేషన్లు ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు దక్కేవి. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్ఏల ప్రమోషన్లకు బ్రేక్ పడింది. వీఆర్ఏలలో డిగ్రీ, పీజీ చేసినోళ్లు 5 వేల మంది వరకు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012, 2014ల్లో రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందినోల్లు 3,700 మంది ఉన్నారు. వీరిలో ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో పనిచేసే వీఆర్ఏలు వీఆర్వోలుగా ప్రమోషన్ పొందారు. మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వలేదు. నిరుడు వీఆర్వోల రద్దుతో వీరి ప్రమోషన్లకు బ్రేక్ పడింది. సీనియారిటీ, క్వాలిఫికేషన్లు ఉన్నా, వీళ్లకు ఏ పోస్టు ఇవ్వాలనే దానిపై అధికారులు అయోమయంలో ఉన్నారు. వీఆర్వోలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌‌‌‌లోకి వస్తారు కాబట్టి, వీఆర్ఏలకూ జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.