- ఉమ్మడి జిల్లాలో 222 ప్రీ ప్రైమరీ స్కూళ్లు మంజూరు
- ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లతో బొమ్మలు, ఆటలతో బోధన
- గ్రామాల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ తరహా విద్య
- కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతుల కల్పన
జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమరీ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా 222 ప్రీప్రైమరీ స్కూళ్లు మంజూరు చేయగా ఇక గ్రామాల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ స్థాయి విద్య అందుబాటులోకి రానుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 140 ప్రీప్రైమరీ స్కూళ్లు ప్రారంభం కాగా ఈసారి మరో 222 మంజూరవడంతో మొత్తం సంఖ్య 362కు చేరనుంది. వచ్చే నెల 12 నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని చిన్నారులకు గ్రామంలోనే నాణ్యమైన ప్రీప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది.
ఆటపాటలతో చదువులు
చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు ప్రీప్రైమరీ విద్యలో ఆటలు, పాటలు, కథలు, బొమ్మల ద్వారా విద్య అందించనున్నారు. చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ప్రత్యేక బోధనా విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఒక ఇన్‌స్ట్రక్టర్, ఆయాను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. దీంతో పాటు ఆకర్షణీయమైన రూమ్‌లు, చిన్నారులకు అనువైన ఫర్నీచర్, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఒక్కో స్కూల్‌కు రూ.1.70లక్షలు కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా మంజూరైన 222 ప్రీప్రైమరీ స్కూళ్లలో జగిత్యాల జిల్లాకు అత్యధికంగా 69 దక్కాయి. కరీంనగర్ జిల్లాకు 58, పెద్దపల్లి జిల్లాకు 48, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 47 స్కూళ్లు కేటాయించారు.
చిన్నారుల భవిష్యత్‌కు పునాది వేయడమే లక్ష్యం
చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నాం. ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సర్కారు బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుంది. ఈసారి జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీ లో ఏకంగా 126 మంది సీట్లు సాధించారు. అలాగే ఈసారి ఎఫ్ఎల్ఎన్ స్కూళ్లలో విద్యార్థుల విద్యా ప్రమాణాల గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. విద్యార్థుల్లో ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ అనేది కేవలం ప్రభుత్వ స్కూళ్లలోనే సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించి ఈ ఉచిత నాణ్యమైన విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. -రాము, జగిత్యాల డీఈవో
