220 నెలల్లో 225 కుంభకోణాలు: ప్రియాంక గాంధీ

220 నెలల్లో 225 కుంభకోణాలు: ప్రియాంక గాంధీ

జబల్పూర్ (మధ్యప్రదేశ్​): మధ్యప్రదేశ్​లో బీజేపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 220 నెలల బీజేపీ పాలనలో 225 కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. గడిచిన మూడేండ్లలో 21 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని ఆమె మండిపడ్డారు. ఎన్నికలప్పుడు బీజేపీ పెద్దపెద్ద హామీలిచ్చింది కానీ, వాటిని నెరవేర్చేందుకు మాత్రం ప్రయత్నించలేదని విమర్శించారు. ఈ ఏడాది చివరినాటికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ సోమవారం జబల్పూర్​లో ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. వ్యాపం, రేషన్ పంపిణీ, మైనింగ్ వంటి స్కామ్​లతో సహా బీజేపీ సర్కారు రాష్ట్రంలో ప్రతినెలా కొత్త కుంభకోణానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. 

అధికారంలోకి వస్తే రూ.500కే సిలిండర్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.1500, రూ.500 కే ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ సిలిండర్‌‌‌‌‌‌‌‌, 100 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందజేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఎన్నో డబుల్, ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వాలను చూశాం కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో ప్రజలు వాటికి తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్​లోని కొంతమంది లీడర్లు అధికారం కోసం పార్టీ సిద్ధాంతాలను విడిచిపెట్టారని జ్యోతిరాదిత్య సింధియానుద్దేశించి ప్రియాంక మండిపడ్డారు. ‘‘వాళ్లు ధన బలంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది”అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ​నుంచి బీజేపీలో చేరిన సింధియా.. తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. దీంతో కమల్​నాథ్ ప్రభుత్వం పడిపోయి చౌహాన్ అధికారంలోకి వచ్చారు. అయితే, సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఏమీ చేయలేదని ప్రియాంక వివర్శించారు. ఇన్నేండ్లుగా మహిళలకోసం ఏమీ చేయని రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టే ప్రకటనలు చేయడం  ప్రారంభించిందని అన్నారు.