జర్నలిస్టులకు 23 ఎకరాల స్థలం కేటాయిస్తాం

జర్నలిస్టులకు 23 ఎకరాల స్థలం కేటాయిస్తాం
  •     వారంలో సమస్య పరిష్కారానికి చొరవ
  •     ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం 23 ఎకరాల స్థలాన్ని కేటాయించి, వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్​కు అభినందనలు తెలిపేందుకు టీయూ డబ్ల్యూయూజే(టీజేఎఫ్) బృందం సభ్యులు గురువారం కలెక్టరేట్​కు​ వెళ్లారు. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న ఇండ్ల స్థలాల విషయాన్ని యూనియన్ లీడర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. 

జీవో 147 ప్రకారం ప్రభుత్వం 23 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. అందులో 8 ఎకరాల భూమి అత్యధిక మార్కెట్ విలువ కలిగి ఉన్నందున ప్రత్యామ్నాయ భూమిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్లు, సర్వేయర్లతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్​ను కలిసిన వారిలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రారవి, ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అమరవరవు కోటేశ్వరరావు, ముత్యాల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మధిర: చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చింతకానిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.