
- ఫ్లైఓవర్లల పటిష్టతపై అధ్యయనం చేయించిన కమిషనర్
- రిపేర్లు అవసరమన్న బల్దియా ఇంజినీరింగ్ టీమ్
- ఇప్పటికే లాలాపేట, జామై ఉస్మానియా ఫ్లైఓవర్లకు రిపేర్లు పూర్తి
- మాసబ్ ట్యాంక్ వద్ద కొనసాగుతున్న పనులు
- రెండో విడతలో మిగిలిన ఫ్లైఓవర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌లోని 24 పాత ఫ్లైఓవర్లు ప్రమాదకరంగా మారాయని బల్దియా
ఇంజినీరింగ్ టీమ్ నివేదిక ఇచ్చింది. దీంతో బల్దియా రిపేర్లు చేయిస్తోంది. ఇప్పటికే రెండు ఫ్లైఓవర్ల పనులు పూర్తికాగా, మరికొన్ని ఫ్లైఓవర్ల పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఫ్లైఓవర్లపై గుంతలతో పాటు వయోడక్ట్‌లను కలిపే చోట ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే, స్ట్రిప్ సీల్ జాయింట్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల కొన్ని ఫ్లై ఓవర్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు శబ్దాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సిటీలోని ఫ్లైఓవర్లపై బల్దియా ఇంజినీరింగ్ టీమ్‌తో అధ్యయనం చేయించారు.
దీంతో వారు ఫ్లై ఓవర్ల పటిష్టతను పరీక్షించి నగరంలోని 24 ఫ్లైఓవర్లను రిపేర్ చేయాలని కమిషనర్‌కు రిపోర్టు ఇచ్చారు. దీంతో మొదటి దశ పనుల్లో భాగంగా రూ.48 లక్షలు కేటాయించి మూడు ఫ్లైఓవర్లకు రిపేర్లు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో ఇప్పటికే లాలాపేట, జామై ఉస్మానియా రైల్వే ఫ్లైఓవర్ల రిపేర్లు పూర్తయ్యాయి.
10 రోజులుగా మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ రిపేర్లు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా రాత్రి 10 గంటల నుంచి రాకపోకలను నిలిపేసి తెల్లవారుజామున వరకు మాత్రమే పనులు చేస్తున్నారు. ఇదివరకు రిపేర్లు చేసిన రెండు ఫ్లైఓవర్లపై ఒక సైడ్ రోడ్ క్లోజ్ చేసి మరోవైపు మరమ్మతులు చేశారు. ఈ ఫార్ములా మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై సాధ్యపడలేదు. మాసబ్ ట్యాంక్ ఫ్లెఓవర్ పై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుండడంతో రాత్రిపూట మాత్రమే పనులు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పై నీటి లీకేజీని నివారించేందుకు, జాయింట్ల వద్ద రోడ్డు దెబ్బతినకుండా స్ట్రిప్ సీల్ జాయింట్లను మారుస్తున్నారు.
సెకండ్ ఫేజ్‌లో మరిన్ని..
1986లో నిర్మించిన ఖైరతాబాద్ ఫ్లైఓవర్ రిపేర్లు కూడా త్వరలో చేయనున్నారు. అలాగే నారాయణగూడ, బషీర్ బాగ్, తార్నాక, మాసబ్ ట్యాంక్ ఫ్లె ఓవర్లను 1999 లో నిర్మించారు. వీటితో పాటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్లో నాలుగు ఫ్లైఓవర్లు, పంజాగుట్ట, తార్నాక, ఫతేనగర్, నల్లగొండ క్రాస్ రోడ్స్, మూసాపేట, సీతాఫల్ మండి, గ్రీన్ ల్యాండ్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌తో పాటు మరిన్ని ఉన్నాయి. వీటిని కూడా నిర్మించి 20 ఏండ్లు అయిపోయాయి.
సాధారణంగా ఫ్లైఓవర్ జీవితకాలం 30 నుంచి 40 ఏండ్లు ఉంటుంది. అయితే, నగరంలోని ఈ ఫ్లై ఓవర్లు అంతకుముందే రిపేర్లకు వచ్చాయి. ఎక్కువ లోడ్ పడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు ఆలస్యం చేయకుండా రిపేర్లు మొదలుపెట్టారు. మొదటి విడతలో మూడు, రెండో, మూడో విడతల్లో మరిన్ని ఫ్లై ఓవర్లపై రిపేర్లు పూర్తి చేయనున్నారు.