వ్యాక్సిన్ కోసం లక్షల్లో రిజిస్ట్రేషన్లు..

వ్యాక్సిన్ కోసం లక్షల్లో రిజిస్ట్రేషన్లు..
  • మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్
  • బుధవారం సాయంత్రం ప్రారంభమైన కోవిన్ రిజిస్ట్రేషన్
  • ఎక్కువమంది ప్రయత్నించడంతో సైట్ క్రాష్

దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు మే 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దానికోసం నేటినుంచి రిజిస్ట్రేషన్ మొదలైంది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి cowin.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కోవిన్ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశముంది. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను బట్టి అపాయింట్ మెంట్ ఫిక్స్ అవుతుంది.  

వ్యాక్సిన్ కోసం 18 ఏళ్లు పైబడిన వారు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. వారికి వాకిన్ వ్యాక్సినేషన్ ఉండబోదని తేల్చి చెప్పింది. అలాగే రాష్ట్రాలకు కేంద్రం సప్లై చేసే వ్యాక్సిన్‌ను 45 ఏళ్లు దాటినవారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 45 ఏళ్ల లోపువారికి రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీల దగ్గర కొనే వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ కచ్చితంగా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్నాక  సర్టిఫికేట్ కచ్చితంగా తీసుకోవాలి. కొవిన్ పోర్టల్‌ ద్వారా కూడా సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ కారణంగా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే 1075 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు ఆరోగ్య శాఖ ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్లను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో 18-45 ఏళ్లలోపు ఉన్న వారు దాదాపు 2కోట్ల మంది ఉంటారని.. వారి కోసం నాలుగు కోట్ల డోసులు కొనాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మే 1న రాష్ట్రంలో పది సెంటర్లలో మాత్రమే 18ఏళ్ల పైబడిన వారికోసం వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ఆర్డర్స్ పెట్టగానే వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తే సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.