గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి

గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి
  • హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయొద్దంటూ అటాక్
  • హాస్టల్ రూమ్స్, బైక్స్ ధ్వంసం 
  • ఇద్దరు విద్యార్థులకు గాయాలు 
  • 25 మందిపై కేసు.. ఇద్దరు అరెస్టు

అహ్మదాబాద్: గుజరాత్​లో విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. అహ్మదాబాద్​లోని గుజరాత్ యూనివర్సిటీలో ఫారిన్ స్టూడెంట్లపై శనివారం రాత్రి కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 నుంచి 25 మంది గుంపుగా వచ్చి స్టూడెంట్లపై అటాక్ చేశారు. విదేశీ విద్యార్థులు నమాజ్ చేస్తుండగా.. హాస్టల్​లో నమాజ్ చేయొద్దని, మసీదులో చేసుకోవాలంటూ ఆ గుంపు దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు స్టూడెంట్లు గాయపడ్డారు. దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కేసు దర్యాప్తుకు 9 టీమ్స్..

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్​గా తీసుకుందని పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ‘‘గుజరాత్ వర్సిటీలో అఫ్గానిస్తాన్, తజికిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా దేశాలకు చెందిన దాదాపు 300 మంది చదువుకుంటున్నారు. వీరిలో 75 మంది ఏ–బ్లాక్ హాస్టల్​లో ఉంటున్నారు. శనివారం రాత్రి 10:50 గంటల టైమ్​లో నమాజ్ చేసుకునేందుకు ఒక్కచోటకు చేరారు. అదే టైమ్​లో 20-- నుంచి 25 మంది దుండగులు హాస్టల్​లోకి చొరబడ్డారు.

హాస్టల్​లో నమాజ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. విదేశీ విద్యార్థులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టారు.. రాళ్లు విసిరారు. వాళ్లుండే రూమ్స్, బైక్స్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో శ్రీలంక, తజికిస్తాన్​కు చెందిన ఇద్దరు స్టూడెంట్లు గాయపడ్డారు. వాళ్లను ఆస్పత్రిలో చేర్పించాం” అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 25 మంది దుండగులపై కేసు పెట్టి, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తు కోసం 9 టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.

కఠిన చర్యలు తీసుకుంటం: కేంద్రం

‘గుజరాత్ వర్సిటీలో జరిగిన ఘటనలో ఇద్దరు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిందితులపై గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి ట్వీట్​ చేశారు.