కోల్‌కతా: బెంగాల్‌లో 58 లక్షల ఓట్లను ఎలక్షన్‌కమిషన్ తొలగించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత ఓటర్‌లిస్ట్ ముసాయిదాను మంగళవారం రిలీజ్ చేసింది. సవరణ తర్వాత తుది జాబితాలో 7 కోట్ల 8 లక్షల 16 వేల 631 మంది పేర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సర్‌కు ముందు 7 కోట్ల 66 లక్షల 37 వేల 529 మంది పేర్లు జాబితాలో ఉండేవి.
అంటే దాదాపు 58 లక్షల 20 వేల 898 ఓట్లు లిస్ట్‌లో నుంచి తొలగించారు. పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది మరణించారని, మరో 19 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది కనిపించకుండా పోయారని, 1.38 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇతర కారణాలతో మరో 57 వేల మంది పేర్లను తొలగించినట్లు ఈసీ వెల్లడించింది. ఈ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
వచ్చే నెల 17వరకు మార్పులు, చేర్పులు
శాసనసభ ఎన్నికల దృష్ట్యా బెంగాల్‌లో ‘సర్’ ప్రక్రియ నవంబరు 4న ప్రారంభించగా.. ఈ నెల 11న ముగిసింది. దీంతో ఈసీ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఇందులో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల కోసం వచ్చే నెల 17 వరకు ఓటర్లకు అవకాశం ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.
డ్రాఫ్ట్ రోల్స్ హార్డ్ కాపీలు బూత్‌స్థాయిలో బీఎల్వోల వద్ద అందుబాటులో ఉంటాయని ఈసీ తెలిపింది. రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా రోల్స్ సాఫ్ట్ కాపీలు అందించినట్టు పేర్కొన్నది. కాగా, ఇది బీజేపీ, ఈసీ ఉమ్మడి కుట్ర అని తృణమూల్కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రతి ఓటరు హక్కులను కాపాడుతామని తెలిపింది.
శ్మశానవాటికలో కౌన్సిలర్ నిరసన
‘సర్’ తర్వాత విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితాలో చనిపోయిన వారి లిస్ట్‌లో తన పేరుందంటూ టీఎంసీ కౌన్సిలర్ వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక శ్మశానవాటికకు వెళ్లి తన అంత్యక్రియలు జరపాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈసీ రిలీజ్ చేసిన ముసాయిదా జాబితాలో డాంకునీ మున్సిపాలిటీలోని 18వ వార్డు కౌన్సిలర్ సూర్య దేవ్ పేరు చనిపోయిన వారి జాబితాలో వచ్చింది.
తాను బూత్ స్థాయి అధికారికి ఎన్యూమరేషన్ ఫారమ్ నింపి ఇచ్చినప్పటికీ ఈ విధంగా జరిగిందని ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మద్దతుదారుల తో కలిసి నేరుగా స్థానిక కాళీపూర్ శ్మశాన వాటికలోకి వెళ్లారు. అధికారులు వచ్చి తనకు అంత్యక్రియలు చేయాలంటూ అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ఇది తప్పిదం కాదని, ప్రమాదకర పరిణామమని మండిపడ్డారు.
