రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 25 శాతం కిస్తీలు..వడ్డీలకే

రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 25 శాతం కిస్తీలు..వడ్డీలకే
  • 2 నెలల రాబడి 19,956 కోట్లు
  • వడ్డీలు, కిస్తీలకు 4,996 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి 2 నెలల్లో వచ్చిన ఆదాయంలో 25%..గతంలో చేసిన అప్పుల కిస్తీలకు, దాని వడ్డీలకే పోయింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వానికి రూ.19,956 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో అప్పుల వడ్డీలు, కిస్తీలకు కలిపి దాదాపు రూ.5 వేల కోట్లు చెల్లించింది. ఇందులో రూ.3162 కోట్లు వడ్డీ చెల్లింపులే ఉన్నాయి. మే నెలకు సంబంధించి రాష్ట్ర అకౌంట్స్​ ఎట్​ గ్లాన్స్​ రిపోర్ట్​ను కాగ్​ సోమవారం రిలీజ్​ చేసింది. దీని ప్రకారం రాష్ట్రానికి నెలకు యావరేజ్​గా వస్తున్న ఆదాయం రూ.10 వేల కోట్ల లోపే ఉంది. ఏప్రిల్​ నెలలో రూ.9,983 కోట్లు వస్తే.. మే లో రూ.9,973 కోట్లు  వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం లో 10 శాతమే సమకూరింది. ఇందు లో జీఎస్టీతో రూ.6,223 కోట్లు రాగా, రిజిస్ట్రేషన్లతో రూ.2,586 కోట్లు, సేల్స్​ టాక్స్​ రూ.4,872 కోట్లు, ఎక్సైజ్​ టాక్స్​ రూ.2,599 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.1,195 కోట్లు వచ్చింది.