బషీర్ బాగ్, వెలుగు: మెగా డీఎస్సీతో 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీ టీచర్పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ సోమవారం లక్డీకాపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ముందు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్నేతృత్వంలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. మెగా డీఎస్సీతోపాటు టెట్ నిర్వహించాలంటూ నిరసన తెలిపారు. వారికి ఆర్.కృష్ణయ్య మద్దతు పలికారు.
6 వేలు కాదు.. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగ యువత ఆగ్రహం కారణంగానే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో టీచర్లు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగులు నమ్మకంతో ఉన్నారని, ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
