పోక్సో కేసులో  25 ఏండ్లు జైలు

పోక్సో కేసులో  25 ఏండ్లు జైలు

మెదక్​టౌన్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ మెదక్​జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద తీర్పు ఇచ్చారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. 2022 జూన్​5న మెదక్ టౌన్‌‌లోని గాంధీనగర్‌‌‌‌ వీధికి చెందిన బాలిక(15) కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన అప్పటి సీఐ మధు విచారణ చేపట్టారు. అదే ఏరియాకు చెందిన డాకూరి నర్సింహులు(21) తీసుకెళ్లాడని గుర్తించి పూర్తి సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. సోమవారం కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద డాకూరి నర్సింహులే నిందితుడని తేలడంతో ఆయనకు 25 ఏళ్ల  కఠిన కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన కోర్టు లైజనింగ్​ ఆఫీసర్ విఠల్, కానిస్టేబుల్ రవీందర్​గౌడ్, హన్మంతును ఎస్పీ అభినందించారు.