వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ లోని కెజిబివి స్కూల్లో 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర కడుపు నొప్పి, వాంతుల వంటి లక్షణాలతో భాద పడుతున్నారు విద్యార్థినీలు. అయితే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు.
రక్తహీనత నిర్మూలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సాయంత్రం స్నాక్స్ లో భాగంగా విద్యార్థినీలకు స్కూల్ సిబ్బంది శనగలు పెట్టారు. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు విద్యార్థునులు అస్వస్థతకు గురవ్వడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరుసగా 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
అందరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం నలుగురు విద్యార్థినులు తప్ప అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. నలుగురు విద్యార్థినులకు ముందుగానే ఆస్తమా ఉండడంతో కొంత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
