ఆడవాళ్లకు బీపీ గండం!.. తెలంగాణలోని 26 శాతం మహిళల్లో హైపర్ టెన్షన్

ఆడవాళ్లకు బీపీ గండం!.. తెలంగాణలోని 26 శాతం మహిళల్లో హైపర్ టెన్షన్
  • బీపీ ఉన్నా మందులు వాడేది 7 శాతం మందే
  • గర్భిణులు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్
  •     గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడ్తున్న లేడీస్
  •     20 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ చెకప్ తప్పనిసరి
  •     దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై ‘విన్ కార్స్ రిపోర్ట్’

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ప్రతి వంద మంది మహిళల్లో 26 మందికి హైపర్ టెన్షన్  ఉన్నట్టు ఓ స్టడీలో తేలింది. వయసుతో సంబంధం లేకుండా బీపీ దాడి చేస్తుండడంతో చాలా మంది మహిళలు గుండె, కిడ్నీ సంబంధ జబ్బుల బారిన పడుతున్నారు. బీపీ సమస్య ఉన్నప్పటికీ అనేక మంది మందులు కూడా వాడటం లేదు. ఈ విషయం ‘ఉమెన్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్’ (విన్​ కార్స్​) స్టడీ రిపోర్టులో వెల్లడైంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ఇన్ ఉమెన్ (ఐజేసీడీడబ్ల్యూ)లో పబ్లిష్ అయిన ‘మల్టీ స్పెషాలిటీ కన్సెన్సస్ స్టేట్‌మెంట్’తో ఈ విషయం బయటపడింది. దేశంలో నాలుగు రీజియన్లలోని మహిళల్లో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించి, అందరి అభిప్రాయాలను సేకరించి ఏకాభిప్రాయంతో ఈ రిపోర్టును రూపొందించారు. ఈ కన్సెన్సస్ స్టేట్‌ మెంట్ రూపకల్పనలో రాష్ట్రం నుంచి  నిమ్స్, అపోలో, ఉస్మానియా హాస్పిటల్స్​కు చెందిన డాక్టర్లూ పాల్గొన్నారు.


జాతీయ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 21.2 శాతం మహిళల్లో బీపీ సమస్య ఉంది. అదే రాష్ట్రంలో 26 శాతంగా నమోదైంది. అంటే, జాతీయ సగటు కంటే మన రాష్ట్రంలోనే బాధితులు ఎక్కువగా ఉన్నారు. రూరల్, అర్బన్ అనే తేడా లేకుండా మహిళలు బీపీ బారిన పడుతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే.. సిక్కింలో అత్యధికంగా 35 శాతం మందిలో బీపీ నమోదవగా.. ఆ తరువాత పంజాబ్ (31 శాతం), కేరళ (30 శాతం ) రాష్ట్రాలు ఉన్నట్టు తేలింది. ఏపీలో మన కంటే తక్కువగా 25 శాతం నమోదుకావడం గమనార్హం. ఈ బీపీ సైలెంట్ కిల్లర్​ అనే సంగతి చాలామంది మహిళలకు తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలో బీపీ ఉన్న మహిళల్లో కేవలం 7 శాతం మంది మాత్రమే రెగ్యులర్‌‌గా మందులు వాడుతున్నారు. మిగతా వారు బీపీకి ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. మెజారిటీ మహిళలు ట్రీట్‌‌మెంట్‌‌ కు దూరంగా ఉండటం వల్ల గుండెపోటు, కిడ్నీ సమస్యలు, పక్షవాతం వంటి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్టు స్టడీ పేర్కొంది.

ఉప్పు, చక్కెర, మైదా పిండిని తగ్గించాలి..  

బీపీని కంట్రోల్ చేయాలంటే వంటింట్లో మార్పులు తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు. వైట్ పాయిజన్స్ గా పిలిచే ఉప్పు,  చక్కెర, మైదా పిండి, వైట్ రైస్ వాడకాన్ని బాగా తగ్గించాలి. వీటి బదులు చిరుధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. హాస్పిటల్ లో బీపీ నార్మల్ గా ఉండి, ఇంట్లో పెరగడం (మాస్క్డ్ హైపర్ టెన్షన్), హాస్పిటల్ లో పెరిగి ఇంట్లో నార్మల్ గా ఉండటం (వైట్ కోట్ హైపర్ టెన్షన్) మహిళల్లో ఎక్కువగా ఉంటుందని.. అందుకే 24 గంటల బీపీ మానిటరింగ్ (ఏబీపీఎం) అవసరమని స్టడీలో  తేల్చారు.  మొత్తంగా మహిళల్లో బీపీని కేవలం ఒక నంబర్ లా చూడకూడదని, వారి లైఫ్ స్టేజ్​లను  బట్టి ట్రీట్మెంట్ అందించాలని ఈ విన్ కార్స్ స్టడీ స్పష్టం చేసింది.

 మహిళలకు మూడు గండాలు... 

మగవారితో పోలిస్తే ఆడవారిలో బీపీ రావడానికి కారణాలు వేరుగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. చిన్న వయసులోనే రజస్వల కావడం, పీసీఓడీ, గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల చిన్న వయసులోనే బీపీ వస్తోందని చెప్తున్నారు. వైద్యుల ప్రకారం..  ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే బీపీ (ప్రీఎక్లాంప్సియా) వల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే. డెలివరీ తర్వాత కూడా దీర్ఘకాలిక గుండె జబ్బులు వచ్చే రిస్క్ నాలుగు రెట్లు పెరుగుతున్నది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నంత కాలం గుండెకు రక్షణ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఈ రక్షణ కోల్పోయి, మగవారికంటే వేగంగా ఆడవారిలో బీపీ పెరుగుతున్నది. దీన్నిబట్టి చూస్తే.. 40 ఏండ్లు దాటిన వారే కాదు.. 20 ఏండ్లు దాటిన ప్రతి యువతి రెగ్యులర్‌‌ గా బీపీ చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణులు, పీసీఓడీ సమస్య ఉన్నవారు, మెనోపాజ్ దశలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. బీపీ ఉంటే డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.