యూరియాకు ఫుల్ డిమాండ్ .. నిజామాబాద్ జిల్లాలో సాగు అంచనా 5.60 లక్షల ఎకరాలు

యూరియాకు ఫుల్ డిమాండ్  .. నిజామాబాద్ జిల్లాలో సాగు అంచనా 5.60 లక్షల ఎకరాలు
  • ఇప్పటికే 2.60 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు 
  • 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం
  • ఇప్పటి వరకు రైతులు కొనుగోలు చేసింది 26 వేల టన్నులు
  • అందుబాటులో ఉన్నది 16 వేల టన్నులు
  • ఇంకా అవసరమున్నది 33 వేల టన్నుల యూరియా 
  • నానో లిక్విడ్ యూరియాతో రైతుల ఆందోళన

 నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. 5.60 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా కాగా, వరి 4.32 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 47,678 ఎకరాలు , సోయాబిన్ 37,859 ఎకరాలు​, పత్తి 1,332 ఎకరాలు, కంది 855 ఎకరాలు, పసుపు 25 వేల ఎకరాలు, వేరు శనగ 514 ఎకరాలు, మరో 3,560 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికే 2.60 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. మొత్తం పంటలకు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. జిల్లాలో నిరుడు వచ్చిన స్టాక్​లో 8 వేల టన్నుల యూరియా ఉండగా, మరో 34 వేల టన్నులు జిల్లాకు వచ్చింది. మొత్తం 42 వేల టన్నుల యూరియాలో ఇప్పటికే 26 వేల టన్నులు రైతులు కొనుగోలు చేయగా, 16 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది.

 నిల్వ ఉన్న యూరియాతోపాటు ఇంకా 33 వేల టన్నుల యూరియా జిల్లా రైతంగానికి అవసరం ఉంది. యూరియా కొరతకు తోడుగా కొత్తగా మార్కెట్​లోకి వచ్చిన నానో యూరియా రైతులను కలవర పెడుతోంది. యూరియా బ్యాగ్​లు కొనకుంటే లిక్విడ్​నానో యూరియా అంటగడతారని ఆందోళనకు గురై రైతులు బారులు తీరుతున్నారు. ఇప్పటికే రెండు బస్తాల యూరియా కొంటే  ఒక నానో లిక్విండ్​ యూరియా డబ్బా తీసుకోవాలని డీలర్లు కండిషన్ పెట్టారు. దీంతో సరిపడా యూరియా కొని స్టాక్​ పెట్టుకోవాలని వరి నాట్లు వేసినవారు, వేయని వారు ఎగబడుతున్నారు. దీంతో యూరియాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈసారి మృగశిరకార్తెకు ముందే వారం రోజులు కురిసిన వర్షాల వల్ల  జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయగా, 41,500 ఎకరాల్లో మొక్కజొన్న, 27,500 ఎకరాల్లో సోయాబిన్ పంటలు సాగు చేశారు.
 
నానో యూరియా వాడాలని ఫోర్స్​..

సెంట్రల్​ గవర్నమెంట్ నానో యూరియా వాడకం పెంచాలని అగ్చికల్చర్ ఆఫీసర్స్​పై ఒత్తిడి తెస్తోంది.ప్రతి 400 యూరియా బస్తాల లోడ్ లారీతో వంద లీడర్ల నానో యారియా పంపుతున్నది.  రూ.266 తో యూరియా బ్యాగ్​ కొనే రైతు పంటపై సొంతగా చల్లుకుంటాడు. అదే లీటర్ నానో యూరియా డబ్బా రూ.225 అయినా డ్రోన్​తో పిచికారీ చేయడానికి రూ.500  ఖర్చవుతోంది. దీంతో రైతులు అంతగా ఆసక్తి  చూపడంలేదు. నానో యూరియా ఖర్చు ఎక్కువే అయినా ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించకపోవడంతో సమస్య 
ఉత్పన్నమవుతోంది.  

సొసైటీ ఎదుట నిరసన

ఆర్మూర్​, వెలుగు : ఆర్మూర్ టౌన్​ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు.  స్టాక్ వచ్చిందని తెలియడంతో ముందుగా లోకల్​ వారికి యూరియా ఇవ్వాలని సొసైటీ ముందు బైఠాయించారు.  సొసైటీ కార్యదర్శి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

యూరియా కొరత లేదు..

జిల్లాలో యూరియా కొరత లేదు. సీజన్​ కోసం వచ్చిన యూరియాను 60 శాతం సింగిల్ విండోలకు, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు పంపాం. డీఫాల్ట్​ అయిన 14 సింగిల్​ విండోలతో రైతులకు ఇబ్బంది రావద్దని  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మూడు విడతల్లో కొనాల్సిన యూరియాను ఒకేసారి కొంటున్నారు. జిల్లాలో 16 వేల టన్నుల యూరియా నిల్వ ఉంది. సరిపడా యూరియా కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. 

వీరాస్వామి, జిల్లా అగ్చికల్చర్ ఆఫీసర్​ 

యూరియా కోసం రైతుల ధర్నా

 లింగంపేట(గాంధారి) వెలుగు:  గాంధారి  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సకాలంలో యూరియా ఇవ్వడం లేదని మంగళవారం మండల కేంద్రంలోని కామారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు.  గాంధారి  సొసైటీ సీఈవో గాండ్ల సాయిలు ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లి  సమస్య పరిష్కరిస్తామని రైతులను సముదాయించడంతో రాస్తారోకో 
విరమించారు.