
ఆంధ్రప్రదేశ్ లో 27 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది రెవెన్యూ శాఖ. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ అమలులో భాగంగా చేపట్టిన ఈ ప్రయత్నాలు త్వరలోనే ఒక కొలిక్కి రానున్నాయి.
3 జిల్లాలుగా అరకు
ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు త్వరలో.. 27 జిల్లాలుగా మారే అవకాశాలున్నాయి.. దీనిపై అధికారికంగా అధ్యయనం సాగుతోంది. పరిధి ఎక్కువగా ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని.. 3 జిల్లాలుగా విభజించే అవకాశాలపై విశ్లేషణ చేస్తున్నారు అధికారులు. అరకు పార్లమెంట్ 4 జిల్లాల పరిధిలో ఉండటమే దీనికి కారణం. పాలకొండ, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా, రంపచోడవం మరో జిల్లాగా, అరకు, పాడేరులను మూడో జిల్లాగా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
తెలంగాణ 7 ముంపు మండలాలు, పోలవరం కలిపి ఒక జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి కలిపిన 7 ముంపు మండలాలతో ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయవచ్చు.
రెవెన్యూ డివిజన్లు పెంచే ఆలోచన
రెవెన్యూ డివిజన్ల సంఖ్య కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 13 జిల్లాల్లో మొత్తం 51 రెవెన్యూ డివిజన్ల ఉన్నాయి. వాటిని 62గా పెంచవచ్చు. 13 జిల్లాలకు సంబంధించిన సమగ్ర వివరాలు తీసుకొని విభజనకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ నుంచి అందుకు అవసరమైన సమాచారం కోరారు.
ఎన్టీఆర్ జిల్లాగా కృష్ణా జిల్లా పేరు
కృష్ణా జిల్లా ను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చుతానని పాదయాత్ర సమయంలో వై ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు నిర్ణయం జరిగింది. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉండటంతో మచిలీపట్నం పార్లమెంట్ ను కృష్ణా జిల్లాగా మార్చే అవకాశం ఉంది.
అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరుకూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.