- రూ.50 కోట్ల విలువైన బియ్యం ఏడాదిగా గోదాముల్లోనే
- టెండర్లు పిలిచినా ముందుకు రాని కొనుగోలుదారులు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సివిల్ సప్లై డిపార్ట్ మెంట్‌కు చెందిన ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాక.. దొడ్డు బియ్యం నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ఫలితంగా ఈ బియ్యానికి ఇప్పటికే పురుగుపట్టగా.. ఇలాగే ఉంటే మిగతా సన్న బియ్యానికి వ్యాపించే పరిస్థితి నెలకొంది. దొడ్డు బియ్యం నిల్వలను అమ్మేందుకు ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ.. కొనుగోలుదారులెవరూ ముందుకు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది.
కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులు
రేషన్ కార్డు కలిగిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటికే ఎఫ్‌సీఐ ద్వారా తరలించిన దొడ్డు బియ్యం ఉమ్మడి జిల్లాలోని రేషన్ షాపులు, గోదాముల్లో 27 వేల మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. కరీంనగర్‌లో 5,213 మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 9,990 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 8,848 మెట్రిక్ టన్నులు, రాజన్న-సిరిసిల్లలో 3,347 మెట్రిక్ టన్నుల నిల్వ ఉండడం గమనార్హం.
ఈ బియ్యం విలువ సుమారు రూ.5కోట్లకుపైగా ఉంటుందని అంచనా. సన్న బియ్యం స్కీమ్ ప్రారంభం కావడంతో ఇక్కడ దొడ్డు బియ్యం అవసరం లేకపోయినా ఆ బియ్యాన్ని తరలించలేదు. ఈ క్రమంలోనే ఈ బియ్యాన్ని అమ్మేందుకు నిరుడు డిసెంబర్‌లోనే ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. కానీ ఈ బియ్యానికి బయట మార్కెట్‌లో డిమాండ్ లేదనో, క్వాలిటీ విషయంలో అనుమానాలతోనో కాంట్రాక్టర్లు ఎవరూ ఈ బియ్యం కొనేందుకు ముందుకు రాలేదు. మే నెలలోనూ మరోసారి టెండర్ పిలిచినా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అధికారులు దొడ్డు బియ్యం ధరను తగ్గించి మరోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
డీలర్లకు పురుగు సమస్య
ఎంఎల్ఎస్ పాయింట్లతోపాటు రేషన్ డీలర్ల దగ్గర సుమారు 8 వేల క్వింటాళ్ల బియ్యం స్టాక్ ఉంది. ఒక్కో డీలర్ దగ్గర 10 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు బియ్యం మిగిలిపోయాయి. వారు తమ ఇళ్లు, గదుల్లో ఈ బియ్యాన్ని నిల్వ చేయడంతో పురుగులు పట్టడంతోపాటు, ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. తాము ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ఈ బియ్యం వాపస్ తీసుకెళ్లడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
