30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే!

30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే!
  • అసోసియేషన్​ఫర్ డెమోక్రటిక్​రీఫార్మ్స్​వెల్లడి
  • ఈ లిస్టులో రూ.510 కోట్లతో ఏపీ సీఎం జగన్​ఫస్ట్​

న్యూఢిల్లీ: దేశంలోని 30 రాష్ట్రాలు, యూటీల ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనట. ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌‌‌‌ జగన్‌‌‌‌ ఫస్ట్ ప్లేస్‌‌‌‌లో ఉన్నారట. ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అత్యధికంగా జగన్‌‌‌‌కు రూ.510 కోట్ల ఆస్తులు ఉన్నట్లు రిపోర్టులో ఏడీఆర్ తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు రూ.23 కోట్ల ఆస్తులు, 8 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొంది. కేవలం రూ.15 లక్షల అసెట్స్‌‌‌‌తో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో చివర్లో నిలిచారు.

దేశంలో 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ముఖ్యమంత్రులు ఉన్నారు. జమ్మూకాశ్మీర్ యూటీగా మారింది. అయితే అక్కడ ఎన్నికలు జరగలేదు. 29 మంది సీఎంల వద్ద సగటున ఒక్కొక్కరికీ రూ.33.96 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. 13 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పింది. ఈ సీరియస్ క్రిమినల్ కేసులు నాన్‌‌‌‌బెయిలబుల్‌‌‌‌ అని, ఐదేండ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడుతుందని రిపోర్టులో పేర్కొంది.

అరుణాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ సీఎం పెమా ఖండు(రూ.163 కోట్లు), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(రూ.63 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు వివరించింది. మమత తర్వాత తక్కువ ఆస్తులు ఉన్న వారిలో కేరళ సీఎం పినరయి విజయన్(రూ.కోటికి పైగా), హర్యానా సీఎం మనోహర్ లాల్ (రూ.కోటికి పైగా) ఉన్నారు. బీహార్ సీఎం నితీశ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌కు రూ.3 కోట్ల చొప్పున ఆస్తులు ఉన్నాయి.