- రంగారెడ్డి జిల్లా కుంట్లూర్‌లో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: రోడ్డు పక్కన ఎండిపోయిన చెట్టు విరిగి మీద పడడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే చనిపోయాడు. ఇందు ఆరణ్యలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సాయికుమార్ (29) ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం గ్యాస్ బుక్ చేసేందుకు గౌరెల్లి వైపు వెళ్తున్నాడు. నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో రోడ్డు పక్కన ఎండిపోయిన చెట్టు అతనిపై విరిగి పడింది.
దీంతో చెట్టు కింద చిక్కుకున్న సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. సాయికి నెల కిందటే పెండ్లయ్యిందని తెలుస్తోంది. ఇలాంటి ఎండిపోయిన చెట్లతో ప్రమాదం ఉందని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఘటనకు ఎంఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
