నేటి (నవంబర్ 19) నుంచి మరో 7 జిల్లాల్లో అంగన్వాడీ బ్రేక్‌‌‌‌ ఫాస్ట్ స్కీమ్

  నేటి (నవంబర్ 19) నుంచి మరో 7 జిల్లాల్లో  అంగన్వాడీ బ్రేక్‌‌‌‌ ఫాస్ట్ స్కీమ్
  • ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తొలిముద్ద విస్తరణ 
  • భూపాలపల్లి, జనగాం, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ప్రారంభం 
  • కొత్తగా 43,657 మంది చిన్నారులకు అందనున్న పోషకాహారం 

హైదరాబాద్, వెలుగు: అంగన్‌‌‌‌ వాడీ చిన్నారుల్లో ఆకలిని దూరం చేసి, పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తొలిముద్ద బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను మరో 7 జిల్లాలకు విస్తరించనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నేటి నుంచి భూపాలపల్లి, జనగాం, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని అంగన్‌‌‌‌ వాడీ సెంటర్లలో 3 నుంచి 6 ఏండ్ల వయసు గల 43,657 మంది చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందించనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా.. 

రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్‌‌‌‌ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఈ స్కీమ్ అమలవుతోంది. ఆయా జిల్లాల్లోని 8,694 అంగన్‌‌‌‌ వాడీ సెంటర్ల ద్వారా రోజుకు 91,796 మంది చిన్నారులకు బ్రేక్‌‌‌‌ ఫాస్ట్ అందిస్తున్నారు. తాజాగా మరో 7 జిల్లాలకు విస్తరించడంతో లబ్ధి పొందే చిన్నారుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ తొలిముద్ద పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు.

నిపుణుల సూచనలతో మెనూ..

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), యునిసెఫ్, ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(ఐఐఎంఆర్) తదితర సంస్థల నిపుణులతో ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. దీని సిఫారసుల మేరకు తెలంగాణ ఫుడ్స్ ద్వారా ఉప్మా మిక్స్, ఖిచిడీ మిక్స్ అనే రెండు రకాల ఇన్‌‌‌‌ స్టంట్ బ్రేక్‌‌‌‌ ఫాస్ట్ మిశ్రమాలను తయారు చేయించింది. వీటి ద్వారా ఒక్కో చిన్నారికి రోజుకు 116.25 కిలో కేలరీల శక్తితోపాటు 3.9 గ్రాముల ప్రోటీన్ అందుతున్నాయి. సోడియం, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, బి1, బి2, బి12, సి, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్ వంటి అవసరమైన సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తున్నాయి.