ఎమ్మెల్సీలకు రోడ్డు ప్రమాదాల వెనుక కుట్ర.. తీన్మార్, బల్మూరి కార్లను ఢీకొట్టి పారిపోయిన వాహనాలు

ఎమ్మెల్సీలకు రోడ్డు ప్రమాదాల వెనుక కుట్ర.. తీన్మార్, బల్మూరి కార్లను ఢీకొట్టి పారిపోయిన వాహనాలు
  • బల్మూరి వెంకట్ కారును ఢీకొట్టి పారిపోయిన డీసీఎం
  • వెంబడించిన గన్‌‌‌‌మెన్ల కారునూ ఢీకొట్టి పరార్
  • ఇటీవల తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ
  • ఆ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న కారులోని మహిళ మృతి
  • హత్యాయత్నమేనని ఇద్దరు ఎమ్మెల్సీల అనుమానం
  • డీజీపీకి ఫిర్యాదు.. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌‌‌‌/షాద్ నగర్, వెలుగు: ఇటీవల ఎమ్మెల్సీల వాహనాలకు జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడే ఇద్దరు ఎమ్మెల్సీలు తీన్మార్​మల్లన్న, బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కార్లు ఒకే తరహాలో ప్రమాదాలకు గురికావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 13న తీన్మార్​మల్లన్న ప్రయాణిస్తున్న కారును యాదాద్రి భువనగిరి జిల్లా తొర్రూర్‌‌‌‌‌‌‌‌లో ఇసుక లారీ ఢీకొట్టగా, తాజాగా బల్మూరి వెంకట్​దంపతులు ప్రయాణిస్తున్న కారును రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ వద్ద డీసీఎం ఢీకొట్టింది. 

ఇద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ కొత్తూరు వద్ద నిందితులను పట్టుకునేందుకు యత్నించిన వారిపైకి కూడా డీసీఎం దూసుకెళ్లడంతో ఈ అంశాన్ని పోలీసులు​సీరియస్​గా తీసుకున్నారు. తాజా ఘటనలో ఎమ్మెల్సీ వెంకట్​తో పాటు ఆయన భార్య, సోదరుడు, డ్రైవర్​స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని నాట్కో జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

వెంకట్ ప్రయాణిస్తున్న కారును కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌‌‌‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో బల్మూరి వెంకట్‌‌‌‌తో పాటు ఆయన భార్య, సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. తమకు జరిగిన రోడ్డు ప్రమాదాలపై అనుమానాలున్నాయని, హత్యకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఇద్దరు ఎమ్మెల్సీలు డీజీపీ ఆనంద్​సహా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

త్రుటిలో తప్పించుకున్న తీన్మార్​ మల్లన్న 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్ కి ఈ నెల13న రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లన్న మోత్కూరు నుంచి తిరుమలగిరి వైపు వెళ్తుండగా అనాజిపురం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయన ఫార్చునర్ కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆయన పాదయాత్రలో ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. కానీ లారీ ఢీకొట్టిన వేగానికి మల్లన్న కారు ముందుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన మేడబోయిన చందన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. 

చందన భర్త సాయినాథ్(శ్రీనాథ్), కారు డ్రైవర్ సురేష్‌‌‌‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అటు కాన్వాయ్ సిబ్బంది, మల్లన్న వాహనంలో ఉన్న డ్రైవర్ బన్నీ, ఆయన అనుచరుడు రంగన్న కూడా గాయపడ్డారు. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, తనపై జరిగిన హత్యాప్రయత్నమేనని తీన్మార్ మల్లన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మోత్కూరు పోలీసులు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.  

గన్​మెన్ల కారునూ ఢీకొట్టడంపై అనుమానాలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన భార్యతో కలిసి తిరుపతి వెళ్లారు. హైదరాబాద్ తిరిగి వస్తుండగా బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును డీసీఎం ట్రక్ బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిది. అప్రమత్తమైన గన్‌‌‌‌మెన్లు డీసీఎంను వెంబడించారు. దీంతో డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గన్‌‌‌‌మెన్ల కారును సైతం ఢీకొంటూ ముందుకు పారిపోయే ప్రయత్నం చేశారు. 

ఈ ప్రమాదం జరిగిన తీరు, ట్రక్‌‌‌‌లో నలుగురు వ్యక్తులు ఉండడంతో ఘటనపై ఎమ్మెల్సీ వెంకట్‌‌‌‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌కు ఫోన్​లో ఫిర్యాదు చేసిన ఆయన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈక్రమంలో ఈ ఘటనలు ప్రమాదాలా? లేదంటే  హత్య కోణం ఏమైనా ఉందా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.