ఆర్టీసీ కార్మికులకు 3.7% డీఏ పెంపు

ఆర్టీసీ కార్మికులకు 3.7% డీఏ పెంపు
  • గతేడాది బకాయిల చెల్లింపునకు ఓకే.. ఉత్తర్వులు జారీ
  • ఈ ఏడాది డీఏ బకాయిలు మాత్రం పెండింగ్‌‌లోనే!

హైదరాబాద్‌‌, వెలుగు: కార్మికులు, ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువు భత్యం(డీఏ) పెంపునకు ఆర్టీసీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి బేసిక్‌‌పై 3.7 శాతం డీఏ పెంచింది. గతేడాది బకాయిలు కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం అడ్మినిస్ట్రేటివ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన డీఏ, గతేడాది జనవరి నుంచి జూన్‌‌ వరకు రావాల్సిన 2% డీఏ ఏరియర్స్‌‌ కూడా ఈ నెల జీతంతో కలిపి చెల్లించనుంది. అయితే ఈ ఏడాది జవనరి నుంచి రావాల్సిన ఐదు నెలల డీఏ ఏరియర్స్‌‌పై ఉత్తుర్వుల్లో క్లారిటీ ఇవ్వలేదు. సాధారణంగా వీటిని ఇస్తామని లేదా తర్వాత ఇస్తామని తెలియజేస్తుంది. కానీ ఈసారి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఐదు నెలల డీఏ ఏరియర్స్‌‌ పెండింగ్‌‌లో ఉన్నట్లయింది. కాగా, ఐదు నెలల బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని, ఈ నెల నుంచే అన్ని బకాయిలు విడుదల చేయాలని నేషనల్‌‌ మజ్దూర్‌‌ యూనియన్‌‌ డిమాండ్‌‌ చేసింది.