వనపర్తి, వెలుగు : మతిస్థిమితం సరిగా లేని వారికి క్షుద్రపూజల ద్వారా నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను గోపాల్‌పేట ఎస్సై హరిప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కందూరు రాజు కొడుకుకు కొన్నేండ్లుగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో వివిధ హాస్పిటల్స్‌లో చూపించినా నయం కాలేదు.
ఇటీవల మతిస్థిమితం సరిగా లేని వారికి నయం చేస్తామని యూట్యూబ్‌లో ఓ వీడియో చూసిన రాజు అందులో కనిపించిన నంబర్‌కు కాల్ చేశాడు. గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపి అనే వ్యక్తులు గోపాల్‌పేటకు వచ్చి బాలుడికి నయం చేస్తామని నమ్మించి, విడతల వారీగా రూ.9.73 లక్షలు తీసుకున్నారు. విజయవాడకు పిలిపించుకొని క్షుద్రపూజలు కూడా చేశారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి రెండు రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపాల్‌పేట పోలీసులు గుంటూరు వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.