
బీజింగ్: చైనా స్పేస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపిన ఆ దేశ వ్యోమగాములు ఆదివారం తిరిగొచ్చారు. షెంఝౌ 15 స్పేస్ షిప్ లో ఉదయం 6.33 గంటలకు(చైనా కాలమానం ప్రకారం) ఉత్తర చైనాలో ఇన్నర్ మంగోలియాలోని డెంగ్ ఫెంగ్ సైట్ లో ల్యాండయ్యారు. ఫెయ్ జున్ లాంగ్, డెంగ్ కింగ్ మింగ్, ఝాంగ్ లూ ఆస్ట్రోనాట్ లు ఆరు నెలల యాత్రను విజయవంతంగా పూర్తిచేశారని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ(సీఎంఎస్ఏ) తెలిపింది.
ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగుందని పేర్కొంది. అలాగే వారి స్థానంలో మరో ముగ్గురిని పంపించామని వెల్లడించింది. గత నెల 30న స్పేస్ స్టేషన్ కి వెళ్లివచ్చిన చైనా పౌరుడు కూడా ఆ ముగ్గురిలో ఉన్నాడని సీఎంఎస్ఏ పేర్కొంది. ఆ ముగ్గురు తమ స్పేస్ స్టేషన్ లో 5 నెలలపాటు గడుపుతారని వివరించింది. కాగా, అంతరిక్షంలో చైనా సొంతంగా స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తున్నది. ప్రస్తుతం రష్యా ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను వివిధ దేశాల భాగస్వామ్యంతో నిర్మించారు. చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్ పూర్తయితే ప్రపంచంలోనే స్పేస్ స్టేషన్ కలిగిన దేశంగా డ్రాగన్ కంట్రీ రికార్డులకు ఎక్కుతుంది.