కరోనాతో 3 కోట్ల ఆకలి చావులు

కరోనాతో 3 కోట్ల ఆకలి చావులు
  • ఫండింగ్​ నిలిచిపోతే చాలా దేశాల్లో ఇదే పరిస్థితి
  • వరల్డ్​ ఫుడ్​ ప్రోగ్రాం హెచ్చరిక
  • ఎకానమీ దెబ్బతిందని మాకు నిధులు ఆపొద్దు
  • ప్రపంచ దేశాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
  • డబ్ల్యూఎఫ్​పీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ బీస్లే

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఆకలితో చనిపోయే పరిస్థితులు ఉన్నాయని వరల్డ్​ఫుడ్​ ప్రోగ్రాం(డబ్ల్యూఎఫ్​పీ) హెచ్చరించింది. ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన వారికి సాయం చేసేందుకు నిధులు అందకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పింది. యునైటెడ్​ నేషన్స్​కు అనుబంధంగా ఉండే డబ్ల్యూఎఫ్​పీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ డేవిడ్​ బీస్లే ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల మందికి వివిధ దేశాల ప్రభుత్వాల ఆర్థిక సాయంతో ఆహారం అందిస్తోందని, వీరిలో 3 కోట్ల మందికి ఈ ఆహారం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఒకవేళ కరోనా వైరస్​ ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, తమకు ఇచ్చే నిధులకు కోత విధించాలని ప్రభుత్వాలు నిర్ణయిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘మాకు ఫండింగ్​ ఆగిపోతే.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3 లక్షల మంది చొప్పున మూడు నెలల్లో కనీసం 3 కోట్ల మంది ఆకలితో చనిపోతారు”అని చెప్పారు. ‘‘ఈ పరిస్థితులను గుర్తించి ప్రపంచ దేశాల నేతలు కరోనా రెస్పాన్స్​ను బ్యాలెన్స్​ చేసుకోవాలి. లేకుండా కరోనా వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోట్లాది మంది ఆకలితో చనిపోయే పరిస్థితి వస్తుంది”అని వివరించారు.

వైరస్​ ఎలా వచ్చిందో తెలియదు
బీస్లేకు మార్చి 13న కరోనా సింప్టమ్స్​ కనిపించాయి. కెనడాలో డబ్ల్యూఎఫ్​పీ కొత్త ఆఫీస్​ ఓపెనింగ్​ కోసం ఒట్టావాతో పాటు పలు ప్రాంతాలకు తిరిగడంతో ఆయన కరోనా సోకింది. దీంతో అమెరికా సౌత్​ కరోలినాలోని డార్లింగ్టన్​లోని తన ఇంటికే పరిమితమయ్యారు. మొదట్లో తనకు ఎలర్జీ సోకిందని భావించినా.. దీంతో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్​ అని తేలింది. బీస్లేతో పాటు కెనడా ప్రోగ్రాంలో పాల్గొన్న ఫెడరల్​ పార్లమెంటరీ సెక్రెటరీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ కమల్​ ఖేరాకు కూడా వైరస్​ సోకింది. బీస్లేతో కలసి ఆమె ఆ ప్రోగ్రాంలో ఫొటో దిగారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. వీరిద్దరికీ కరోనా రావడంతో ఆ సమయంలో వీరిని కలిసిన వారిని అప్రమత్తం చేశారు. తాను వెళ్లిన ప్రతి చోటా హ్యాండ్​ శానిటైజర్​ వాడానని, తాను చాలా జాగ్రత్తగా ఉంటానని కానీ తనకు వైరస్​ఎలా వచ్చిందో అర్థం కాలేదని చెప్పారు.

ప్రస్తుతం వర్క్​ఫ్రం హోం చేస్తున్నా
ప్రస్తుతం తాను వర్క్​ ఫ్రం హోం చేస్తున్నానని, డబ్ల్యూఎఫ్​పీ ఫండింగ్​కు సంబంధించి రోజు ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నానని బీస్లే చెప్పారు. ఆహారం, ఇతర వస్తువుల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారిని కోరానన్నారు. ప్రస్తుతం 97 శాతం మంది డబ్ల్యూఎఫ్​పీ స్టాఫ్ ఫీల్డ్​లో పనిచేస్తున్నారని, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం సప్లై చేస్తున్నారని చెప్పారు. దీనికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని దేశాలు ఆహార పదార్థాలు తీసుకెళ్లే ట్రక్కులు, ఎయిరోప్లేన్లను రెండు వారాలు క్వారంటైన్​లో ఉంచాలని సూచిస్తున్నాయని, కానీ అన్ని రోజులు వాటిని వాడకుండా ఉంటే చాలా మంది ఆకలితో చనిపోతారని వివరించారు. యునైటెడ్​ నేషన్స్​ ఎమర్జెన్సీ ఆపరేషన్స్​ముఖ్యంగా డబ్ల్యూహెచ్​వో, యూఎన్​ రెఫ్యూజీ ఏజెన్సీ, యునిసెఫ్​ కు సంబంధించిన టెస్టింగ్​ కిట్స్, మాస్క్, వ్యక్తిగత రక్షణ పరికరాలను డబ్ల్యూఎఫ్​పీ ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్​పోర్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఇవి తయారయ్యే దుబాయ్, అట్లాంటా, గ్వాంగ్​ఝూ మొదలైన ప్రాంతాల్లో హబ్​లను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి విమానాలు, ఓడల్లో వీటిని రీజినల్​ హబ్స్​కు చేరవేస్తుంది. అక్కడి నుంచి అవి ఎక్కువగా అవసరమయ్యే కంట్రీలకు సప్లై చేస్తుంది. ఈ హబ్స్​కు సపోర్ట్​గా 350 మిలియన్ల అమెరికన్​ డాలర్లు కావాలని డబ్ల్యూఎఫ్​పీ కోరుతోంది. కానీ బుధవారం నాటికి ఇందులో 20 శాతమే వచ్చింది.