
కాగజ్నగర్,వెలుగు: బామ్మర్దిని కాపాడదామని బావ.. బావ, తమ్ముడి కోసం అన్న.. బావిలోకి దిగి ఊపిరాడక మృతిచెందారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో బుధవారం ఈ విషాదఘటన చోటుచేసుకుంది. ముత్యంపేటకు చెందిన కారం రాజులు కుమారుడు కారం మహేశ్(18) ఉదయం 11 గంటలకు ఇంట్లోని 3/3 రింగుల బావిలో బోరు మోటార్ బయటకు తీసేందుకు దిగాడు. దిగిన తర్వాత ఎటువంటి అలికిడి లేకపోడం, పిలిచినా పలకకపోవడంతో కరెంట్ షాక్ కొట్టిందనుకున్నరు. వెంటనే పైనఉన్న బావ శ్రీనివాస్(25), మహేశ్‌కు అన్న అయ్యే గాజిరెడ్డి రాకేశ్(25) కరెంట కనెక్షన్ తీసేశారు. మహేశ్‌ను కాపాడేందుకు శ్రీనివాస్ బావిలోకి దిగాడు. లోపలికి వెళ్లిన తరువాత శ్రీనివాస్ నుంచి కూడా ఎటువంటి శబ్దం లేకపోవడతో రాకేశ్ బావిలోకి దిగాడు. ముగ్గురి నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారిని కాపాడాలని ఏడూస్తూ కేకలు వేశారు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని చూడగా అప్పటికే బావిలో ముగ్గురు మృతిచెందారు.
బావిలో దిగి ముగ్గురు చనిపోయిన విషయం దావానంలా వ్యాపించింది. కౌటాల సీఐ మోహన్, ఎస్సై ఆంజనేయులు, తహసీల్దారు రామ్మోహన్ సిబ్బందితో వెంటనే ఘటనాస్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామానికి చెందిన గాండ్ల దొన్నయ్య, కోసరి నరేష్, పంజాల పోశంను బావిలోకి దించారు. మధ్యలోకి వెళ్లాగానే వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారడంతో పైనున్న వాళ్లు తాళ్ల సాయంతో బయటకు లాగారు. పంజాల పోశం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన అతి కష్టంమీద ప్రాణాలతో బయటపడ్డారు. పరిస్థితి తీవ్రత తెలుసుకున్న జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ఇన్‌చార్జి డీఎస్పీ సత్యనారాయణ బావి వద్దకు చేరకున్నారు.
రాత్రి 9 గంటలకు మృతదేహాల వెలికితీత
బావిలోకి దిగేందుకు ప్రయత్నించిన వారు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు అనుమానించిన పోలీసులు.. కోడికి తాడు కట్టి బావిలో దించగా అది నిమిషాల్లో చనిపోయింది. పోలీసు, రెవెన్యూ అధికారులు వెంటనే సింగరేణి రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. సాయంత్రం ఐదు గంటలకు మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ గనికి చెందిన15 మెంబర్స్ సింగరేణి రెస్క్యూటీమ్ అక్కడికి చేరుకుంది. అప్పటికే పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రొక్లైన్‌తో బావికి సమాంతరంగా గుంత త్వడం ప్రారంభించారు. ఇందుకోసం పక్కన ఉన్న ఇండ్లు కూల్చివేశారు. అదే టైమ్‌కు వానపడడంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. బావిలోకి దిగేకొద్ది ఆక్సిజన్ తగ్గిపోతోందని… మృతదేహాలు ఉన్న చోట నాలుగు శాతం కంటే తక్కువగా ఉందని… విషవాయువులు కూడా ఉన్నాయని రెస్క్యూ టీమ్ నిర్ధారించింది. అంత తక్కువ ఆక్సిజన్ ఉంటే అతికష్టంమీద ఒకటి రెండు నిమిషాలకంటే ఎక్కుసేపు బతకలేమని వివరించింది. ప్రొక్లెయిన్‌తో బావికి సమాతరంగా తవ్వి ఆక్సిజన్ సింలిడర్ల సాయంతో లోనికి వెళ్లి రాత్రి 9 గంటల ప్రాంతంలో మృతదేహాలు వెలికితీసింది. అప్పటి వరకు ఎస్పీ మల్లారెడ్డి ఘటనాస్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. ఆర్డీవో శివకుమార్, ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ, కౌటాల డాక్టర్ పల్లవి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
కొడుకును చూసేందుకు వచ్చి…
ఒకరికోసం ఒకరు బావిలోకి దిగి ప్రాణాలు పోగొట్టుకున్న ముగ్గురి కుటుంబాల్లో అంతులేని అంధకారం నెలకొంది. మహేశ్, రాకేశ్‌లు వరుసకు అన్నదమ్ముళ్లు. మహేశ్ సొంత బావ చొక్కాల శ్రీనివాస్‌ది భీమిని మండలం శిఖినం. భార్య శైలజతో పాటు కొడుకు నవదీప్, కూతురు ప్రవళిక ఉన్నారు. అమ్మమ్మ వద్ద ఊంటూ చదువుకుంటున్న నవదీప్‌ను చూసిపోయేందుకు శ్రీనివాస్ బుధవారం వచ్చాడు. రాకేశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.