అభివృద్ధి పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలి : తుమ్మల నాగేశ్వరరావు

అభివృద్ధి పనులు ఇన్​టైంలో పూర్తి చేయాలి : తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : ఖమ్మం నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్​వో సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లు, అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా చేపట్టాలన్నారు. 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద ఉధృతి తట్టుకునేలా 8.5 కిలోమీటర్లకు పైగా రిటైనింగ్ వాల్ రెండు వైపులా ఏడాదిలోపు పూర్తి చేయాలని చెప్పారు. మంచుకొండ లిఫ్ట్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పనులు ప్రతిపాదించాలని ఆదేశించారు.

ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద 8.5 కిలో మీటర్ల మురుగు నీటి కాల్వ నిర్మించాలన్నారు.  కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. వెలుగు మట్ల అర్బన్ పార్క్ లోజరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రచారం కల్పించాలన్నారు. రోడ్లకు ఇరు వైపులా మొక్కలు నాటాలని సూచించారు.  ఖమ్మం ఖిల్లా రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ధంసలాపురం ఎగ్జిట్ దగ్గర రైల్వే లైన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

 ఎంపీ మాట్లాడుతూ నగరంలో జరిగే పర్యాటక అభివృద్ధి పనులకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూముల సేకరణ కోసం రైతులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు 91 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర కింద రూ.112 కోట్లు, సన్న రకం వడ్ల బోనస్ కింద రూ.12 కోట్ల రైతులకు చెల్లించినట్లు వివరించారు. అనంతరం ఖమ్మం నగరంలోని 49 వ డివిజన్ మామిల్లగూడెం లో రూ. 60 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు, స్మార్ట్ డ్రైన్ లు, 7వ డివిజన్ టేకులపల్లిలో రూ. 40.40 లక్షలతో స్మార్ట్ డ్రైన్, కల్వర్ట్ నిర్మాణ పనులకు మంత్రి, ఎంపీ, కేఎంసీ కమిషనర్​ శంకుస్థాపన చేశారు.