
Bengaluru Namma Metro: రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు బెంగళూరులో జాబ్స్ చేస్తున్నారు. ఐటీ పరిశ్రమ విస్తరణతో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరులోని టెక్కీలను చాలా కాలంగా పీడిస్తున్న అంశం ట్రాఫిక్. సరైన మెట్రో కనెక్టివిటీ లేకపోవటం కూడా చాలా మంది సొంత వాహనాలపై వెళ్లాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది.
అయితే ప్రస్తుతం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్కీలకు ఒక శుభవార్తను ప్రకటించింది. చాలా కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న మెట్రో ఎల్లో లైన్ మే 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నమ్మ మెట్రో వెల్లడించింది. ఈ రూటు ఆర్వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు ప్రయాణికులు సులువు చేయనుంది. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో నివసించే లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఎల్లో లైన్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది.
కొత్తగా మెట్రో ఎల్లో లైన్ రూటు అందుబాటులోకి రావటం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గటంతో పాటు ఉద్యోగులకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల ఆఫీసులు ఉన్న ఈ ప్రాంతంలో రద్దీ సమస్యలు తగ్గనున్నాయని అధికారులు చెబుతున్నారు. బొమ్మసంద్ర నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి కేవలం 6 కిలోమీటర్ల దూరం ఉండటంతో మెట్రో కనెక్టివిటీ ద్వారా కేవలం కొన్ని నిమిషాల ప్రయాణంతోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఫిబ్రవరి 14న చైనాలో తయారైన 6 కోచెస్ బెంగళూరుకు చేరుకున్నాయి. త్వరలోనే ఇలాంటివి మరో ఆరింటిని తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రూట్ స్టార్ట్ అయితే ప్రయాణికులు ఇండస్ట్రియల్ హబ్, రెసిడెన్షియల్ హబ్ మధ్య ప్రయాణం సుగమం అవుతుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.