
అన్న కోసం వెళ్లి..
టైటిల్ : బ్రొమాన్స్
ప్లాట్ ఫాం : సోనీ లివ్
డైరెక్షన్ : అర్జున్ డి. జోస్
కాస్ట్ : మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, బిను పప్పు
షింటో (శ్యామ్ మోహన్), బింటో (మాథ్యూ థామస్) అన్నదమ్ములు. షింటో కుటుంబానికి దూరంగా కొచ్చిలో ఉంటూ స్టాక్‌మార్కెట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజు షింటో కనిపించకుండా పోతాడు. దాంతో అతని ఫ్రెండ్ షబీర్ (అర్జున్ అశోకన్) బింటోకు ఫోన్ చేసి జరిగింది చెప్పి, కొచ్చికి రమ్మంటాడు. కూర్గ్‌లో న్యూ ఇయర్ పార్టీ కోసం వెళ్లిన బింటో వెంటనే తన అన్నని వెతకడం కోసం కొచ్చికి వెళ్తాడు. ఆరా తీస్తే.. షింటో కనిపించకుండా పోవడానికి ముందు రోజు ఐశ్వర్య(మహిమ నంబియార్) అనే అమ్మాయి మోసం చేసిందని తనతో చెప్తూ బాధపడ్డాడని షబీర్ చెప్తాడు.
బింటో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి గొడవపడతాడు. కానీ.. ఆమె తనకేం తెలియదని చెప్తుంది. తర్వాత హరిహరసూధన్(సంగీత్ ప్రతాప్) అనే హ్యాకర్ హెల్ప్‌తో షింటోని వెతకడం మొదలుపెడతాడు బింటో. తనకు ఐశ్వర్య కూడా సాయం చేస్తుంటుంది. ఇంతకీ షింటో ఏమయ్యాడు? బింటోకు ఎస్ఐ టోనీ (బిను పప్పు) నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? షింటోని కనిపెట్టడానికి బింటో ఏం చేశాడు? తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.
విగ్రహంతో అనుబంధం!
టైటిల్ : కాలాపత్తర్
ప్లాట్ ఫాం : సన్ నెక్స్ట్
డైరెక్షన్ : విక్కీ వరుణ్
కాస్ట్ : విక్కీ వరుణ్, ధన్యా రాంకుమార్, రాజేష్ నటరంగ, సంపత్, టిఎస్ నాగభరణం
ముదలాపురం అనే గ్రామానికి చెందిన శంకర్ (విక్కీ వరుణ్) కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్‌కు పెద్ద అభిమాని. శంకర్ బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో వంటవాడిగా పనిచేస్తుంటాడు. ఎప్పుడూ.. సైన్యంలో ఫ్రంట్‌లైన్ వారియర్‌గా మారి, శత్రువులను ఎదుర్కోవాలని కలలు కంటుంటాడు. అయితే.. ఒకరోజు అతను అనుకున్నట్టుగానే అలాంటి అవకాశం వస్తుంది. వంట చేస్తున్న టైంలో ఆర్మీ అధికారుల మీద ఉగ్రవాద దాడి జరుగుతుంది. అప్పుడు శంకర్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అందరి దృష్టిలో హీరో అవుతాడు. అతని గౌరవార్థం తన సొంతూరిలో ప్రజలు శంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటారు.
►ALSO READ | పరిచయం : ఇంటి నుంచే షూటింగ్‌కి వెళ్లా : రిద్ది కుమార్
కానీ.. ఆ ఊరివాళ్లు కనీసం ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉంటారు. తాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బంది పడుతుంటారు. దాంతో కాంస్య విగ్రహానికి డబ్బు సర్దుబాటు కాక, కాలాపత్తర్ (నల్ల రాయి)తో శంకర్ విగ్రహాన్ని తయారుచేయిస్తారు. కొన్నాళ్లకు ఊరికి తిరిగివచ్చిన శంకర్ తన విగ్రహంతో విడదీయలేని అనుబంధం ఏర్పరుచుకుంటాడు. వర్షానికి విగ్రహం తడుస్తుంటే తానే తడుస్తున్నట్టుగా భావిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఊరి సమస్యలకు పరిష్కారం దొరికిందా? లేదా? ఆ విగ్రహం వల్ల శంకర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే మిగతా కథ.
నీళ్ల వ్యాపారం..
టైటిల్ : వరుణన్
ప్లాట్ ఫాం : ఆహా
డైరెక్షన్ : జయవేల్ మురుగన్
కాస్ట్ : రాధారవి, చరణ్‌రాజ్, దుష్యంత్ జయప్రకాష్, గాబ్రియెల్లా, శంకర్‌నాగ్ విజయన్
చెన్నైలోని రాయపురం ప్రాంతంలో అయ్యవు (రాధారవి) ఒక వాటర్ ప్లాంట్, సప్లై ఏజెన్సీని నడుపుతుంటాడు. అతని ప్రత్యర్థి జాన్ (చరణ్‌రాజ్) కూడా వాటర్ సప్లై వ్యాపారంలోనే ఉంటాడు. కొన్నిసార్లు రీఫిల్స్ కోసం అయ్యవు ప్లాంట్‌పై ఆధారపడతాడు. ఇద్దరూ ఒకరి ఏరియాలోకి మరొకరు వెళ్లకుండా ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకుంటూ ఉంటారు. కానీ.. జాన్ భార్య రాణి (మహేశ్వరి), బావమరిది డబ్బా (శంకర్ నాగ్) కలిసి అయ్యవు వ్యాపారాన్ని దెబ్బతీయాలి అనుకుంటారు.
అందుకోసం అయ్యవు దగ్గర డెలివరీ బాయ్స్‌గా పనిచేసే తిల్లై (దుష్యంత్), మరుదు (ప్రియదర్శన్)ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ.. చివరకు అది రెండు వర్గాల మధ్య తగాదాకు దారితీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శత్రుత్వం పెరగడం వల్ల వాళ్లిద్దరూ ఎలా నష్టపోయారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.