పరిచయం : ఇంటి నుంచే షూటింగ్​కి వెళ్లా : రిద్ది కుమార్

పరిచయం :  ఇంటి నుంచే షూటింగ్​కి వెళ్లా : రిద్ది కుమార్

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో ఒక క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అదే హీరోకి జోడీగా నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హారర్​ కామెడీ ఫిల్మ్ రాజాసాబ్’లో కనిపించనుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్​ సినిమా ‘సూపర్ బాయ్స్​ ఆఫ్​ మాలెగావ్​’లో నటించి మెప్పించింది. ఈ అమ్మాయి పేరు రిద్ది కుమార్. తెలుగు, హిందీతోపాటు మలయాళం, మరాఠీల్లోనూ నటించిన ఆమె జర్నీ ఇది. 

మహారాష్ట్రలోని షిరిడీలో పుట్టింది రిద్ది కుమార్. పుణెలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వాళ్ల అమ్మది మహారాష్ట్ర, నాన్నది జార్ఖండ్​. ప్రొఫెషనల్​గా వాళ్లమ్మ లాయర్​ కాగా నాన్న ఆర్మీ ఆఫీసర్. వాళ్ల నాన్న ఉద్యోగం రీత్యా దేశంలోని చాలా ప్రాంతాల్లో నివాసం ఉంటూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో 2018లో అడుగుపెట్టింది. ఆమె నటించిన తొలి సినిమా ‘లవర్​’. తర్వాత ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమాలో నటించింది. తెలుగుతోపాటు మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో నటించింది. హిందీలో క్యాండీ, హ్యూమన్, క్రాష్​ కోర్స్​, హ్యాక్ క్రైమ్స్ ఆన్​లైన్ వంటి సిరీస్​ల్లో నటించింది. పద్నాలుగేండ్లకే కెరీర్ స్టార్ట్ చేసిన రిద్ది. తన జర్నీలో ఇంట్రెస్టింగ్ సంగతుల్ని పలు ఇంటర్వ్యూల్లో ఇలా షేర్ చేసుకుంది. 

కెరీర్ మొదలు

చిన్నప్పటి నుంచి గ్లామర్, సినిమా ఫీల్డ్ నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఎదిగేకొద్దీ కళ, మిగతా క్రాప్ట్స్ గురించి అర్థం చేసుకున్నా. నేను నా కెరీర్​ని నేరుగా ఇండస్ట్రీలో మొదలుపెట్టలేదు. కాలేజీ చదివేరోజుల్లో మోడలింగ్, బ్యూటీ పీజెంట్స్ వంటి వాటిలో పార్టిసిపేట్ చేశా. అలాగే, షార్ట్​ఫిల్మ్స్ కూడా చేశా. ఆ తర్వాత నా ఫ్రెండ్​ ఒకరు, ‘లవర్’ అనే తెలుగు సినిమా కోసం కాస్టింగ్ జరుగుతోందని తెలిసి కాస్టింగ్​ డైరెక్టర్​​కి నా ఫొటోలు పంపారు. 

►ALSO READ | ముందు జరిగేదంతా శుభమే

ఆ తర్వాత వాళ్లు నన్ను ఆడిషన్​కి పిలిచారు. లుక్​ టెస్ట్ చేశారు. ఫైనల్​గా నన్ను హీరోయిన్​గా సెలక్ట్ చేశారు. అలా నా మూవీ కెరీర్​ స్టార్ట్ అయింది. అయితే అప్పటికి నా చదువు పూర్తి కాలేదు. ‘లవర్​’ షూటింగ్ అయిపోయాక ఆ రోజు సాయంత్రం ఫ్లైట్​ ఎక్కి పుణె వెళ్లి, మరుసటి రోజు చివరి పేపర్ ఎగ్జామ్ రాశా. చదువు విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. 

సూపర్ బాయ్స్​ ఆఫ్​ మాలెగావ్​ గురించి..

ఈ సినిమాకి బెస్ట్ టీం పనిచేసింది. అలాంటి టీంతో కలిసి వర్క్ చేయడం కూడా చాలామంది డ్రీమ్​. ఆ విషయంలో నేను చాలా తృప్తిగా ఉన్నా. దాంతోపాటు ఈ మధ్యే మా నాన్నకు ఆ షూటింగ్​ ప్లేస్​కి దగ్గర్లో ట్రాన్స్​ఫర్ అయింది. దీంతో ఏదో ఒక ఆఫీస్​కి వెళ్లినట్టు రోజూ ఇంటి నుంచే సెట్​కి వెళ్లేదాన్ని. అది నిజంగా మెమొరబుల్ నాకు. ఎందుకంటే సినిమాలో నటించాలంటే ఇంటి నుంచి వెళ్లడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఈ సినిమా వల్ల నాకు ఆ అవకాశం కూడా దక్కింది. షూటింగ్ జరిగే ప్రదేశం దగ్గర్లోనే కాబట్టి రోజూ ఇంటి నుంచి వెళ్లేదాన్ని. 

డైలాగ్ ప్రిపరేషన్

నా డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్​, హిందీలో రాయించుకుంటా. వాటిని చదివి గుర్తుపెట్టుకుంటా. వాటి అర్థాలు తెలియకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్​ని అడిగి డౌట్ క్లియర్ చేసుకుంటా. షూట్​ అనగానే నా డైలాగ్స్ నేను ప్రిపేర్ అయి రెడీగా ఉంటా. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తుండడం వల్ల భాష మీద పట్టు వచ్చింది. మొదటి సినిమా నుంచే నేర్చుకోవడం మొదలుపెట్టా. ఇప్పుడు తెలుగు నాకు బాగా అర్థమవుతుంది. చాలావరకు తప్పులు లేకుండా మాట్లాడగలను. ఇతర భాషల్ని కూడా అలానే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. 

నచ్చింది చేస్తేనే సక్సెస్

మా పేరెంట్స్ నాకు ఒకటే చెప్పేవాళ్లు. ‘నీకు ఏది నచ్చితే అదే చెయ్​. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు’ అని. ఈ ఫీల్డ్​లోకి వస్తానన్నప్పుడు వాళ్లు నన్ను ఆపలేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్​ అంటే నాకు ఎంత ఇష్టమో వాళ్లకు తెలుసు. ఇప్పటికీ వాళ్ల సపోర్ట్, ఎంకరేంజ్​మెంట్ నాకు ఉన్నాయి. సినిమాల విషయంలో నేను కాస్త సెలక్టివ్​గా ఉంటా. హీరోయిన్​గానే చేయాలని లేదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గరకొచ్చే స్క్రిప్ట్స్​ని అలానే ఎంచుకుంటా. కామెడీ రోల్స్, డిటెక్టివ్​, పోలీస్​, వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రల్లో నటించాలనుకుంటున్నా. 

ప్రభాస్  నిజంగానే డార్లింగ్..

‘రాధేశ్యామ్​’లో ఆర్చర్​ ప్లేయర్​గా కనిపించా. నేను స్పోర్ట్స్ పెద్దగా ఆడను. కానీ, ఈ సినిమా కోసం ఆర్చరీ నేర్చుకున్నా. ‘రాధేశ్యామ్​’ సినిమాలో అవకాశం వచ్చి షూటింగ్​కి వెళ్లేవరకు ఇంట్లో చెప్పలేదు. దాంతో అమ్మ చాలా సర్​ప్రైజ్ అయింది. ఆ తర్వాతి రోజు అమ్మ నాతోపాటు సెట్​కి వచ్చి, షూటింగ్ చూసి చాలా సంతోషపడింది. నా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడుతూనే.. నన్ను వీలైనంత ఒదిగి ఉండమని చెప్తుంటారు. ఈ ఫేమ్​ అనేది నా తలకెక్కకూడదు అని వాళ్ల కోరిక.ప్రభాస్ విషయానికొస్తే ఆయన్ను అందరూ డార్లింగ్ అని ఎందుకు అంటారో తనతో కలిసి పనిచేసినప్పుడు అర్థం అయింది. 

చాలా మంచివ్యక్తి, షూటింగ్​ విషయంలో కూడా బాగా సపోర్ట్ చేశారు. అంత ఎత్తుకు ఎదిగాక కూడా ఒదిగి ఉండడం ఎలా అనేది నేను ఆయన్నుంచి నేర్చుకున్నా. అప్పటికే ఆయన ఇండియన్ సినిమాకే బిగ్గెస్ట్ స్టార్​గా ఉన్నారు. అలాంటి వ్యక్తి అంత ఒదిగి ఉండడం చూసి ఆశ్చర్యమేసింది. మా ఇద్దరి కాంబినేషన్ ఉన్న సీన్ ఇటలీలో తీశారు. నాకు అక్కడి వాతావరణం కొత్త. దాంతో నా ఇబ్బందిని గమనించిన ఆయన నా దగ్గరకొచ్చి ‘ఏం టెన్షన్ పడొద్దు. 

టైం తీసుకుని చెయ్’  అని చెప్పారు. షూటింగ్ అయిపోయాక ‘నా పెర్ఫామెన్స్ నచ్చింద’ని కూడా నాతో అన్నారు. ఆయన నిజంగానే డార్లింగ్​ అనిపించింది. ఆ సెట్​లో మేం ఇద్దరం ఫుడ్​, సీన్స్, ఇటాలియన్​ పిజ్జాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న ‘రాజా సాబ్’​లో లీడ్​ రోల్​ చేసే అవకాశం దక్కింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ మూవీ కోసం ఆడియెన్స్​లానే నేనూ ఎంతగానో ఎదురుచూస్తున్నా.