దేశం గర్వించేలా స్కూళ్ల ఏర్పాటు : డిప్యూటీ సీఎం భట్టి

 దేశం గర్వించేలా స్కూళ్ల ఏర్పాటు : డిప్యూటీ సీఎం భట్టి
  • రాష్ట్రంలో రూ.21 వేల కోట్లతో 105  ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ 
  • డిప్యూటీ సీఎం భట్టి
  • లక్ష్మీపురంలో స్కూల్ బిల్డింగ్​నిర్మాణానికి భూమి పూజ

మధిర, వెలుగు:  దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు రూ.21 వేల కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. శనివారం బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

 అనంతరం మీడియాతో మాట్లాడుతూ అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఉద్దేశమన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామమని ప్రజా ప్రభుత్వం ప్రకటన చేసినప్పుడు ఇది సాధ్యమేనా? అంటూ బీఆర్ఎస్ హాస్యాస్పదం చేసిందని, కానీ, చిత్తశుద్ధి, సంకల్ప బలంతో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్ ను మొదటి సంవత్సరంలోనే మంజూరు చేసిందని తెలిపారు.

 ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో  పిల్లల భవిష్యత్తే తమ  బాధ్యతగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా మరో 47 స్కూళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు క్రికెట్, ఫుట్​బాల్ అవుట్ డోర్, ఇండోర్ ఆటలకు సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఉండేలా దాదాపు 25 ఎకరాల్లో డిజైన్ చేశామని వివరించారు. స్టూడెంట్స్​తో పాటు టీచింగ్ స్టాఫ్  ఉండేలా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ స్కూళ్లు దేశానికి రోల్ మోడల్ గా నిలువనున్నాయన్నారు. 

అభివృద్ధి పనుల్లో రాజీపడకండి

ముదిగొండ : కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిగొండ మండల అభివృద్ధి పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. మండలంలోని బాణాపురం ఎస్సీ కాలనీ నుంచి మంగాపురం తండా గ్రామం వరకు రూ.8.50 కోట్లతో, నాచెపల్లి నుంచి బాణాపురం తండా వరకు రూ.4.70కోట్లతో నిర్మాణం చేయనున్న ఆర్ అండ్ బీ రోడ్డు పనులకు, మండల కేంద్రంలో రూ. 22 కోట్లతో 50 పడకల పీహెచ్​సీభవన నిర్మాణానికి, మండలంలోని 27 గ్రామాల్లో రూ. 4 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న 84 అంతర్గత రోడ్ల పనులకు, రూ. 15 లక్షలతో నిర్మించనున్న పాల శీతలీకరణ కేంద్ర ప్రహారీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ పనులన్నీ నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి, డీఎంహెచ్​ఓ బి. కళావతి బాయి, పంచాయతీ రాజ్ ఈఈ  వెంకట్ రెడ్డి, డీఈ కేవీకే శ్రీనివాస రావు, ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేశ్​బాబు తదితరులు  ఉన్నారు.