
టాలెంట్కు కృషి, పట్టుదల తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు. తండ్రి హమాలీ..తల్లి కూలిపని..వెంటాడుతున్న పేదరికం అయినా మొక్కవోని దీక్షతో చదివి జడ్జి అయ్యాడు. కనీసం భోజనం, రూం రెంట్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఈ యువకుడు కష్టపడి చదివి అనుకున్నది సాధించాడు. తల్లిదండ్రులు కలను సాకారం చేశాడు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల మండలం హస్నాబాద్ కు చెందిన పట్నం నరేష్ ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. నిరుపేద పుట్టిన నరేష్.. తండ్రి కనకయ్య హమాలి పని ,తల్లి యాదవ్వ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న క్రమంలో చదువుకోవడానికి, రూం రెంట్ కట్టేందుకు డబ్బులు లేని పరిస్థితులను ఎదుర్కొన్నాడు.
చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితుల్లో ర్యాపిడో నడుపుతూ వచ్చిన దానితో చదువుకున్నాడు. మొక్కవోని దీక్షతో ఎల్ఎల్బీ పూర్తి చేసి జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు రాశాడు. ఫలితాల్లో విజయం సాధించాడు. నరేష్ సివిల్ జడ్జిగా ఎంపికవ్వడం పట్ల అతని కుటుంబ సభ్యులు, జగిత్యాల వాసులు హర్షవ్యక్తం చేశారు. నరేష్ కు అభినందనలు తెలిపారు.